iDreamPost
android-app
ios-app

పంచాయతీ ఎన్నికలకు ఎందుకంత ప్రాముఖ్యం..?

పంచాయతీ ఎన్నికలకు ఎందుకంత ప్రాముఖ్యం..?

పంచాయతీ సర్పంచ్‌గా గెలవడం కన్నా.. ఎంపీగా గెలవడం సులువంటారు. ఈ మాట.. పంచాయతీ సర్పంచ్‌ పదవికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. స్థానిక సమస్యలను స్థానికులకే బాగా తెలుసు, వాటి పరిష్కారం కూడా వారి చేతిలోనే పెట్టడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తగ్గుతుంది. చోళులు, చాళుక్యుల కాలం నుంచే భారత దేశంలో పంచాయతీ వ్యవస్థ ఉంది. అప్పటి నుంచి 1994 పంచాయతీ రాజ్‌ చట్టం వరకూ స్థానిక పరిపాలనలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. స్థానిక పరిపాలనను బలోపేతం చేసే దిశగా ఈ మార్పులు జరిగాయి. ప్రస్తుతం 1994 పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు ఎన్నికలకు జరుగుతున్నాయి. ఈ చట్టం ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా లభించింది. స్పష్టమైన విధులు, అధికారాలు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు కట్టబెట్టారు.

పంచాయతీ రాజ్‌ చట్టం – 1994 తర్వాత ఇప్పటి వరకు నాలుగు సార్లు పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. నాలుగు దశల్లో జరగబోయే ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల 21వ తేదీతో ముగుస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనలో తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో ఏపీలో గ్రామ స్వరాజ్యం నెలకొంటోంది. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలు, వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయం, పాడి రంగాలకు సేవలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా గ్రామీణ వైద్యం, గోడౌన్లు, కోల్ట్‌ స్టోరేజీలు, జనతా బజార్ల ఏర్పాటు ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెద్దపీట, మన బడి నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ, ఇంగ్లీష్‌ మీడియంలో చదువులు.. ఇలా అనేక సంస్కరణల ద్వారా ఏపీలో గ్రామ రాజ్యం వెల్లివిరుస్తోంది. ఈ విధులను అన్నింటినీ పంచాయతీనే నిర్వహించాల్సి ఉంటుంది.

పంచాయతీ సర్పంచ్‌ ఈ విధులలో కీలక పాత్ర పోషిస్తారు. పాలక మండలితోపాటు గ్రామ సచివాలయంలోని సిబ్బంది, వలంటీర్లుతో కూడిన మానవ వనరులు సర్పంచ్‌కు అందుబాటులో ఉంటాయి. వీరి సేవలు సమర్థవంతంగా వినియోగించుకుంటూ పరిపాలన చేయాల్సిన బాధ్యత సర్పంచ్‌పై ఉంది. ఫలితంగా మునుపెన్నడూలేని విధంగా ఏపీలో పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికలకు అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పంచాయతీకి, సర్పంచ్‌కు ఉన్న రాజ్యాంగబద్ధమైన విధులు, అధికారాలు ఏమిటో ఒక సారి తెలుసుకుందాం.

తప్పనిసరి విధులు..

చిన్నా, పెద్దా పంచాయతీలు అనే వ్యత్యాసం లేకుండా, ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా.. ప్రతి పంచాయతీ కొన్ని విధులను తప్పనిసరిగా నిర్వర్తించాలి.

– పంచాయతీ స్థాయిలో ఆర్థిక వనరులను సమీకరించడం
– జనన, మర ణాలను నమోదు చేయడం
– భౌగోళిక పరిధిలో భవనాలు, రహదారులు, వంతెనలను నిర్మించడం. వాటిని నిర్వహించడం.
– ప్రజా మరుగుదొడ్లు నిర్మాణం. నిర్వహణ
– వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ
– మురుగు కాల్వల నిర్మాణం, నిర్వహణ
– పంచాయతీ పరిధిలోని బజార్లు, వీధుల్లో చెత్తకుప్పులు, పిచ్చిమొక్కలు తొలగించడం.
– శ్మశాన వాటికల ఏర్పాటు, నిర్వహణ
– అంటు వ్యాధుల నివారణ
– రక్షిత మంచినీటి సరఫరా
– కంపోస్టు ఎరువుల తయారీ
– కబేళా ఏర్పాటు, నిర్వహణ

నిధుల లభ్యత ఆధారంగా కొన్ని బాధ్యతలను పంచాయతీలు నిర్వహించాల్సి ఉంటుంది. అవీ..

– గ్రంథాలయాల ఏర్పాటు, నిర్వహణ
– ప్రయాణికులకు ధర్మశాలలు, విశ్రాంతి గృహాల నిర్మాణం
– రహదారుల వెంబడి, సామాజిక ప్రాంతాల్లో చెట్లు నాటడం.
– వైద్యశాలల ఏర్పాటు, నిర్వహణ
– ఆటస్థలాలు, వ్యాయామశాలల ఏర్పాటు
– పార్కుల నిర్మాణం, నిర్వహణ
– వికలాంగులు, రోగులకు సహాయ కార్యక్రమాలు
– గిడ్డంగులు నిర్మాణం, నిర్వహణ
– ఆధునాతన వ్యవసాయ పద్ధతులను అనుసరించడం
– వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రదర్శనలు నిర్వహించడం
– గ్రామ నివేశన స్థలాల విస్తరణ
– సహకార సంఘాలకు చేయూతనివ్వడం
– ప్రసూతి, శిశు సంక్షేమ కేంద్రాల స్థాపన, నిర్వహణ
– మార్కెట్లు, జాతరలు, ఉత్సవాల నిర్వహణ
– పశువుల కొట్టాల స్థాపన, నిర్వహణ
– నిరుద్యోగ గణాంకాల తయారీ
– విపత్తు సమయంలో సహాయక చర్యలు
– వీధి కుక్కలను నియంత్రించడం
– కమతాల ఏకీకరణ, భూ సంస్కరణ చర్యలు
– గ్రామ ప్రజల నైతిక, సాంఘిక, భౌతిక సంక్షేమం పెంపొందించడం
– అవినీతి, అస్పృశ్యతల నివారణకు కృషి
– పబ్లిక్‌ మార్కెట్‌ల ఏర్పాటు, నిర్వహణ
– పశుసమృద్ధికి చర్యలు, పశు వైద్య సహాయం.

పాలనాపరమైన విధులు..

– ప్రకటనల ఏర్పాటకు అనుమతులు మంజూరు చేయడం. అనుమతిలేని వాటిని తొలగించడం.
– లైసెన్స్‌లేని పందులను, కుక్కలను నియంత్రించడం, నిర్మూలించడం
– రోడ్లపై ఆటంకాల ఏర్పాటు, గుంతలను తవ్వడం నిషేధించడం
– అనుమతి లేకుండా పబ్లిక్‌ ప్రాంతాల్లో చెట్లు నాటడం, కొట్టివేసిన వారిపై చర్యలు తీసుకోవడం.
– పబ్లిక్‌ రోడ్లపై విక్రయం నిషేధించడం
– ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడం
– ప్రైవేటు మార్కెట్లకు లైసెన్స్‌లు ఇవ్వడం
– వివిధ యంత్రాల వల్ల కలిగే శబ్ధాలను నియంత్రించడానికి చర్యలు తీసుకోవడం.

గ్రామ పంచాయతీ ఆర్థిక వనరులు..

– పన్నుల ద్వారా వచ్చే ఆదాయం.. ఇంటిపన్ను, వృత్తి పన్ను, ఆస్తుల బదిలీపై పన్ను, దుకాణాలపై పన్ను, భూమి శిస్తు, వాహనాలపై పన్ను, ఖాళీ స్థలాలపై పనున జంతువులపై పన్ను తదితరాలు.
– స్థిరాస్తులపై వచ్చే ఆదాయం.. అద్దెలు, లీజులు వగైరాలు.
– ఫీజులు, రుసుముల వసూళ్లు
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే గ్రాంట్లు.
– వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను
– సెల్‌ఫోన్‌ టవర్‌ ఏర్పాటుపై ఫీజులు

సర్పంచ్‌ అధికారాలు – విధులు..

రాష్ట్రానికి రాజకీయఅధిపతి ముఖ్యమంత్రి కాగా.. పంచాయతీకి సర్పంచ్‌. గ్రామ పంచాయతీ, గ్రామ సభలకు సర్పంచ్‌ అధ్యక్షత వహిస్తారు. పంచాయతీకి సర్పంచే ప్రథమ పౌరుడు. నెలకొకసారి గ్రామ పంచాయతీ సమావేశాన్ని సర్పంచ్‌ నిర్వహిస్తారు. ఆరు నెలలకు ఒకసారి గ్రామ సభ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. గ్రామ పంచాయతీ వార్షిక ఖాతాను ప్రతి సంవత్సరం ఆడిట్‌ చేయిస్తారు. పంచాయతీ రికార్డులను తనిఖీ చేసే అధికారం సర్పంచ్‌కు ఉంటుంది. పంచాయతీ సభ్యుల అనర్హతలను జిల్లా పంచాయతీ అధికారికి తెలియజేస్తారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ఏ అధికారి నుంచైనా.. ఎలాంటి సమాచారాన్నైనా సర్పంచ్‌ పొందగలరు. పంచాయతీ కార్యదర్శిపై పరిపాలనా పరమైన నియంత్రణ ఉంటుంది.