iDreamPost
iDreamPost
తెలంగాణ ప్రభుత్వ టీచర్లు ఇకపై ఏటా తమ ఆస్తుల వివరాలను సమర్పించాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అంటే, ప్రభుత్వ టీచర్లు స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా విద్యాశాఖ అనుమతి తప్పసరి. ఈమేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.
నల్గొండ జిల్లా చందంపేట మండలం గుంటిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్ విధులకు హాజరుకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నాడని, రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాడని, వక్ఫ్ బోర్డు పేరుతో సెటిల్ మెంట్లు చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీనికితోడు అతనికి, సోదరుని మధ్య భూవివాదం ఉంది. పలుకుబడి ఉపయోగించి, కేంద్ర స్థాయి వరకు ఇద్దరూ ఫిర్యాదులు చేసుకున్నారు.
ఈ ఘటనపై విజిలెన్స్ విచారణ చేపట్టింది. జావేద్ ఆలీపై వచ్చిన ఆరోపణల్లో చాలావరకు నిజమేనని, అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చింది. అతనితోపాటు, విద్యాశాఖ పరిధిలోని ఉద్యోగులందరూ తమ ఆస్తుల వివరాలను ప్రతియేడూ ప్రభుత్వానికి సమర్పించేలా ఉత్తర్వులివ్వాలని ప్రభుత్వానికి సిఫార్స్ చేసింది. ఆ నివేదిక ఆధారంగానే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఆదేశాలు గతంలో ఉన్నా, ఇప్పుడు ప్రతియేటా సమర్పించాలని ఆదేశించడం సరైంది కాదని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.