iDreamPost
android-app
ios-app

అంగన్ వాడీలకు ప్రభుత్వం శుభవార్త!

అంగన్ వాడీలకు ప్రభుత్వం శుభవార్త!

మరి కొన్ని నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు వరాల జల్లు కురిపిస్తుంది కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిన సంగతి విదితమే. ఇప్పుడు అంగన్ వాడీలకు శుభవార్త తెలిపింది. కనీస వేతనం పాతిక వేలకు పెంచాలని, ఉద్యోగ క్రమబద్దీకరణ, పని భారం తగ్గింపు వంటి డిమాండ్లతో అంగన్ వాడీలు ఇటీవల రోడ్లెక్కిన సంగతి విదితమే. ఇప్పుడు వారి ఆగ్రహ జ్వాలలను చల్లార్చేందుకు ఉపక్రమించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంగన్ వాడీ టీచర్లను త్వరలో ప్రకటించే పీఆర్సీలో చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అలాగే మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు ఆదివారం ప్రకటన చేశారు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్ లో అంగన్ వాడీల సమ్మె, డిమాండ్లపై ఏఐటీయూసీ, సీఐటియు నాయకులతో హారీష్ రావు, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అంగన్ వాడీల డిమాండ్లపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటే అంగన్ వాడీ ఉద్యోగుల జీతాలను పెంచుతామని హామీనిచ్చారు. ఇతర డిమాండ్లపై నివేదిక సమర్పించాలని, త్వరలోనే వాటిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, అంగన్ వాడీలు కూడా పీఆర్సీ కింద వర్తిస్తే .. 70 వేల మంది ఉద్యోగులకు లాభం చేకూరుతుందని హరీష్ రావు తెలిపారు. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించడంతో కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.