iDreamPost
iDreamPost
ఈ నెల 8న వైష్ణవ్ తేజ్ కొండపొలం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మొన్నటి దాకా దానికే పోటీ లేదు. ముందు ప్లాన్ చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా 15కి షిఫ్ట్ అయ్యింది. సో సోలోగా వర్కౌట్ చేసుకోవచ్చనే అంచనాలో నిర్మాతలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో హరి హర వీర మల్లు తీస్తున్న దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో ఇదే పేరుతో వచ్చిన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల ఆధారంగా రూపొందిన ఈ ఫారెస్ట్ థ్రిల్లర్ ట్రైలర్ ఇటీవలే వచ్చి బాగానే ఆకట్టుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కావడం, ఎంఎం కీరవాణి సంగీతం తదితర ఆకర్షణలు దీనికి గట్టిగానే ఉన్నాయి. రిపబ్లిక్ నిరాశపరిచిన వారానికే ఇది రావడం ఫాన్స్ కి కిక్ ఇచ్చేదే.
సరే ఇదంతా బాగానే ఉంది కానీ నిన్న ఉన్నట్టుండి గోపీచంద్ ఆరడుగుల బులెట్ ని కూడా అదే 8కి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఎప్పుడో అయిదేళ్ల క్రితం వాయిదా పడి అసలు వస్తుందో రాదో అనే అనుమానాల మధ్య ఊగిసలాడుతున్న ఈ సినిమాకు ఒకప్పటి కమర్షియల్ స్టార్ డైరెక్టర్ బి గోపాల్ బ్రాండ్ దీనికి ఉండటం విశేషం. నయనతార హీరోయిన్. ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటుల క్యాస్టింగ్, మణిశర్మ సంగీతం ఇలా దీనికీ ప్రత్యేకతలు లేకపోలేదు. కానీ విపరీతమైన జాప్యం వల్ల ఈ చిత్రం మీద హైప్ ఎప్పుడో తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఉన్నట్టుండి రిలీజ్ చేయడం వెనుక ఏం స్ట్రాటజీ ఉందో మరి.
గత నెల వచ్చిన సీటిమార్ బ్రేక్ ఈవెన్ చేరుకోకపోయినా ఉన్నంతలో భారీ నష్టం రాకుండా డీసెంట్ గానే వసూళ్లు రాబట్టింది. అయితే అది డౌన్ అయిపోయిందనుకున్న గోపీచంద్ మార్కెట్ ని పూర్తిగా కాకపోయినా కొంతవరకు రికవరీ చేయడంలో ఉపయోగపడింది. మరి ఈ ఆరడుగుల బులెట్ లో నిజంగా విషయం ఉందా లేక ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని వదులుతున్నారా సినిమా చూశాకే క్లారిటీ వస్తుంది. కానీ ఉప్పెన ఇమేజ్ తో అమాంతం దూసుకొచ్చిన వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాతో పోలిస్తే దీనికి బజ్ తేవడం అంత ఈజీ కాదు. మరి టీమ్ ఇప్పటికప్పుడు చేతిలో ఉన్న అయిదు రోజుల్లో ఏమైనా ప్రమోషన్లు చేసి హైప్ పెంచుతారేమో చూడాలి
Also Read : అఖిల్ కు ముగ్గురితో యుద్ధం