Idream media
Idream media
1980లో నకిలీ మనిషి అనే సినిమా వచ్చింది. చిరంజీవి మొదటి డబుల్ యాక్షన్ సినిమా. ఆయనకిది 18వ సినిమా. ఇంకా స్టార్ ఇమేజ్ రాలేదు కానీ, గుర్తింపు మొదలైంది. ఫైట్స్ చేయాలంటే హీరోలకు డూప్‌లు అవసరమయ్యే రోజుల్లో చిరంజీవి గుర్రపు స్వారీతో సహా అన్నీ సొంతంగా చేసేవాడు.
సంగీత హీరోయిన్‌గా చేసింది. ఇంకో లీడ్ రోల్ సునీత చేసింది. ఆ తర్వాత ఆమె స్క్రీన్‌పై ఎప్పుడూ కనపడలేదు. డిటెక్టివ్ రచయిత కొమ్మూరు సాంబశివరావు నవలకు గొల్లపూడి మాటలు స్క్రీన్ ప్లే రాశారు. పాయింట్ చాలా డిఫరెంట్‌గా ఉన్నా , సగం తర్వాత రొటీన్ యాక్షన్ మూవీగా మారిపోతుంది.
ప్రసాద్ (చిరంజీవి) కొన్ని కారణాల వల్ల Job పోగొట్టుకుంటాడు. భార్యా , ఇద్దరు పిల్లలతో బతకడం కష్టమవుతుంది. నిస్సహాయ పరిస్థితుల్లో రమ (సునీత) డబ్బు సాయం చేస్తుంది. ప్రతిఫలంగా అతని చావుని కోరుతుంది. దీనికి ప్రసాద్ అంగీకరిస్తాడు.
ఒక అర్ధరాత్రి రమ చెప్పిన బట్టలు వేసుకుని వంతెన మీదికి వస్తే ఒక లారీ వచ్చి అతన్ని ఢీకొట్టాలి. ఇది ప్లాన్. అయితే చివరి క్షణంలో ప్రసాద్ నిర్ణయాన్ని మార్చుకుని పారిపోతాడు. అతని కోసం వెంటపడతారు.
విషయం ఏమంటే అతని పోలికలతోనే ఉన్న శ్యాం (చిరంజీవి) ఒక క్రిమినల్. తన పోలికలతో ఉన్న ప్రసాద్‌ను చంపేసి, తానే చనిపోయినట్టు లోకాన్ని నమ్మించడం అతని ప్లాన్. ఇక్కడి వరకూ చాలా బిగువుగా సాగిన సినిమా , తర్వాత కథ లేకుండా అనేక పల్టీలు కొట్టి రొటీన్‌గా మారుతుంది.
నిజానికి ఈ సినిమా కరెక్ట్‌గా తీసింటే అప్పుడే చిరంజీవికి పెద్ద బ్రేక్ అయి ఉండేది. చాలా సీన్స్‌లో విపరీతమైన ఎనర్జీతో ఉంటాడు. లో బడ్జెట్ కావడం, ప్రొడక్షన్ నాసిరకంగా ఉండటం, ఏదో రీళ్లు చుట్టేయాలనుకోవడంతో చిరంజీవికి మంచి యాక్షన్ మూవీ మిస్ అయిపోయింది. అయితే ఇది ఎంతో కొంత వసూలు చేసి గుర్తింపు పోకుండా చేసింది.
చిరంజీవిలో హీరో కంటే మంచి విలన్ ఉన్నాడు. ఇది కథ కాదులో కాసేపే కనిపించినా గుర్తుండిపోతాడు. దీని తర్వాత వచ్చిన మోసగాడులో విలన్‌గా స్టయిలిష్‌గా ఉంటాడు.