iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చుట్టూ అర్థసత్యాలతో విషప్రచారానికి పూనుకునే బ్యాచ్ కూడా అంగీకరించాల్సిన సత్యాలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ ముందుకుపోతోందని, ఏపీ వెనుకబడిపోతోందంటూ మొసలి కన్నీరుగార్చే సెక్షన్ కి మింగుడుపడని పరిణామాలు ఏపీలో జరుగుతున్నాయి. తెలంగాణాలో కేవలం హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి కేంద్రీకరించబడుతుంటే ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతోందని తాజా లెక్కలు చెబుతున్నాయి. 2021-22లో ఏకంగా 35 శాతం అదనంగా రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం రావడం అందుకు తార్కాణం. రాజధాని లేని రాష్ట్రం, అమరావతి లేకుండా ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించే వాళ్లకు తాజా లెక్కలు గొంతులో పచ్చివెలక్కాయపడ్డట్టుగా మార్చేస్తున్నాయి.
సరిగ్గా అదే సమయంలో జీఎస్టీ వసూళ్ల లెక్కల్లో కేంద్ర ప్రభుత్వ వివరాల ప్రకారం ఏపీ టాప్ లో ఉంది. వృద్ధి రేటులో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ ముందంజలో నిలిచింది. ఆదాయం పరంగా నాలుగో స్థానం ఉంది. 2021 మార్చి నెలలో రూ. 2685 కోట్ల ఆదాయం ఏపీ నుంచి రాగా అదే 2022 మార్చిలో రూ. 3వేల కోట్ల మార్క్ దాటేసింది. 18 శాతం వృద్ధి రేటు సాధించింది. రూ. 3175 కోట్ల జీఎస్టీ పన్నుల వసూళ్లు ఏపీ నుంచి వచ్చాయి. ఆదాయం పరంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణా తర్వాత నిలిచింది. కానీ వృద్ధిరేటులో కేరళ 14 శాతం, కర్ణాటక 11 శాతం, తమిళనాడు 6 శాతం, తెలంగాణా కేవలం 2 శాతం చొప్పున వృద్ధి సాధించగా ఏపీ ఏకంగా 18 శాతం ఉండడం విశేషం. రాష్ట్రంలో పన్నుల వసూళ్లు పెరుగుతుండడం కూడా అభివృద్ధికి కొలమానంగా భావిస్తారు. దాంతో ఈ లెక్కలు కూడా జగన్ వ్యతిరేకులకు కొరుకుడుపడే అవకాశం కనిపించడం లేదు.
అదే సమయంలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం భారీగా పెరగడంతో మొన్నటి మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 7327 కోట్ల ఆదాయం వచ్చింది. కేవలం ఒక్క మార్చి నెలలోనే వెయ్యి కోట్ల పన్ను ఆదాయం ప్రభుత్వానికి రావడం విశేషం. 2020-21 లో ఇది సుమారుగా రూ. 5,399 కోట్లుగా ఉంది. ఏడాది వ్యవధిలో రూ. 2వేల కోట్ల ఆదాయం పెరగడం రికార్డుగా భావించాలి. ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందనడానికి ఇదో తార్కాణంగా భావించాలి. చంద్రబాబు హయాంలో 2017-18లో ఇది రూ. 4,242.23 కోట్లు కాగా మరుసటి ఏడాది 2018-19లో 4,725 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం దాంతో పోలిస్తే ఏకంగా 75 శాతం పెరుగుదల నమోదు కావడం గమనార్హం. తద్వారా జగన్ ప్రభుత్వహయాంలో ఏపీ వెనుకబడిపోయిందని, రియల్ ఎస్టేట్ రంగం పడకేసిందని ప్రచారం చేస్తున్నవారికి ఈ లెక్కులు పెద్ద ఎదురుదెబ్బగా భావించాల్సి ఉంటుంది. క్రమంగా ఏపీ పుంజుకుని పట్టాలపైకెక్కుతున్న తీరుని ఇది తేటతెల్లం చేస్తుంది.