iDreamPost
android-app
ios-app

సినిమా బాలేదంటే ఇంత ఓవరాక్షనా?

  • Published Jan 24, 2023 | 8:55 PM Updated Updated Jan 24, 2023 | 8:55 PM
సినిమా బాలేదంటే ఇంత ఓవరాక్షనా?

కొందరు దర్శకులు అదేంటో దైవాంశ సంభూతుల్లా ఫీలవుతారు. దేవుళ్ళైనా భక్తులు ఏదైనా మాట అంటే పడతారేమో కానీ తమను తాము కల్ట్ డైరెక్టర్లుగా గొప్పలు పోయే వాళ్ళు మాత్రం కెరీర్ ని త్వరగా ముగించుకుంటారు. మలయాళంలో ప్రేమమ్ రూపంలో పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆల్ఫోన్స్ పుత్రేన్ ఏడేళ్లు గ్యాప్ తీసుకుని గోల్డ్ అనే కళాఖండం చెక్కాడు. మల్లువుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన పృథ్విరాజ్ సుకుమారన్ హీరో కాగా నయనతార హీరోయిన్. వీళ్ళ రెమ్యునరేషన్లకే ఎంత ఖర్చు అయ్యుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంత బడ్జెట్ చేతిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని స్క్రిప్ట్ రాసుకుంటారు. కానీ ఆల్ఫోన్స్ పుత్రేన్ చేసింది వేరు.

విపరీతమైన ల్యాగ్ తో సరైన కథా కథనాలు లేకుండా మూడు గంటలకు దగ్గరగా ఉన్న మెంటల్ టార్చర్ ని కానుకగా ఇచ్చాడు. ఇది డిసెంబర్ లో వచ్చింది. సహజంగానే రివ్యూలు నెగటివ్ గా వచ్చాయి. పబ్లిక్ టాక్ దారుణంగా ఉంది. ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులు పెద్ద క్లాసులు తీసుకున్నారు. కట్ చేస్తే వీటిని రిసీవ్ చేసుకోవడం ఇతని వల్ల కాలేదు. ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్ లో కూడా వచ్చేసింది. దీని తర్వాత విమర్శలు ఇంకా ఎక్కువయ్యాయి. దీంతో ఈయన ఫేస్ బుక్ వేదికగా ఒక లాంటి వార్నింగ్ ఇచ్చేశాడు. తన పనితనం జడ్జ్ చేయాలంటే ఒక్క కమల్ హాసన్ కు మాత్రమే ఆ అర్హత ఉందని ఇంకెవరు సరితూగరని ఓ రేంజ్ లో ఊగిపోయాడు.

ఏ నెగటివిటీని తీసుకోవడానికి సిద్ధంగా లేనని అసలా హక్కు ఎవరికీ లేదని ఘాటుగా చెప్పాడు. టికెట్లు కొని డబ్బులు ఖర్చు పెట్టిన ఆడియన్స్ కి న్యాయం జరగనప్పుడు మరి ఈయన మాత్రం ఆ సొమ్ములు వెనక్కు ఇస్తాడా లేదు కదా. అంత మాత్రానికి నెక్స్ట్ ప్రాజెక్టు కసితో చేయడం వదిలేసి ఇలా అయిపోయిన జాతరలో రేగిపళ్ళు ఏరుకోవడం వల్ల ఎవరికి లాభం. పైగా కనీసం యావరేజ్ కంటెంట్ ఉన్నా ఎదోలే అని తన ఆవేదనని అర్థం చేసుకోవచ్చు. యునానిమస్ గా డిజాస్టర్ అనిపించుకున్న సినిమాని నేను గొప్పగా తీశానని చెప్పుకుంటే చులకన అయ్యేది ఎవరు. ఈ లాజిక్ మిస్ అయిన ఆల్ఫోన్స్ పుత్రేన్ మరోసారి ఇంకో రూపంలో టార్గెట్ అయిపోయాడు