iDreamPost
iDreamPost
ఏపీ సెక్రటేరియేట్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. రాజధానిలో నాలుగు రోజులుగా నిరసనలు తెలుపుతున్న స్థానికులు జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ వెలువడిన తర్వాత రెచ్చిపోయారు. పెద్ద స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ సెక్రటేరియేట్ లోకి దూసుకెళ్ళే ప్రయత్నం చేశారు. టైర్లు తగులబెట్టి రోడ్డు మీద భైఠాయించారు. బారీకేడ్లు విసిరేశారు. పలు ఫ్లెక్సీలు చింపివేశారు. వెలగపూడితో పాటుగా మందడం వై జంక్షన్ లో కూడా నిరసనలు హోరెత్తుతున్నాయి.
అమరావతి రాజధాని విషయంలో గత మంగళవారం నాడు సీఎం చేసిన ప్రకటనతో వివాదం మొదలయ్యింది. ఆరోజు నుంచి నిరసనలు మొదలయ్యాయి. తాజాగా జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ పట్ల అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే సమగ్రాభివృద్ధి కోసం కమిటీ ఇచ్చిన రిపోర్ట్ అమరావతి ప్రాంత వాసుల ఆగ్రహాన్ని రెట్టింపు చేసింది. దాంతో వారు మరింత రెచ్చిపోయారు. నేరుగా సెక్రటేరియేట్ లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు అడ్డుకోవడంతో మరింత ఉద్రిక్తత ఏర్పడింది.
Read Also : మూడు రాజధానులు, నాలుగు రీజియన్లు
పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు. ఎక్కడికక్కడ ఆందోళనకారులను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ పలువురు పోలీసుల కళ్లుగప్పి రోడ్డెక్కి నిరసనలకు పూనుకున్నారు. జీఎన్ రావు కమిటీ పూర్తిగా బూటకమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల పేరుతో తమను కించపరిచేలా కమిటీ వ్యాఖ్యలున్నాయని మండిపడుతున్నారు. కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు కొనసాగిస్తున్నారు.