Idream media
Idream media
గ్రేటర్ హైదరాబాద్‌ను ఏలేవారిని నిర్ణయించే పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన గ్రేటర్ పోలింగ్ నిదానంగా జరుగుతోంది. ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్ బూత్‌లకు వస్తున్నారు. 150 డివిజన్లలో 1123 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని గ్రేటర్ ఓటర్లు తేల్చనున్నారు. ఉదయం 9 గంటల వరకు సరాసరి 3.10 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. గాజుల రామారంలో అత్యల్పంగా 1.67 శాతం నమోదైంది. 2016 ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీలో సరాసరి 45 శాతం మేర పోలింగ్ నమోదైంది. ఈ సారి 50 శాతం దాటుదుందనే అంచనాలున్నాయి.
నగర ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా, వారిలో స్ఫూర్తి నింపేలా రాజకీయ, అధికార ప్రముఖులు కుటుంబసమేతంగా ఉదయాన్నే ఓటు వేసేందుకు వస్తున్నారు. సినీ నటుడు చిరంజీవి దంపతులు జూబ్లిహిల్స్ క్లబ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి కేటీఆర్ దంపతులు నందినగర్‌లో ఓటు వేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాచిగూడ ఓటు వేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలిస్ కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్, కుందన్‌భగవత్‌లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉమేష్‌కుమార్ కుటుంబ సమేతంగా వచ్చి కూకట్‌పల్లిలో ఓటు వేశారు. నగర భవిష్యత్ కోసం, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు.
పోలింగ్ ప్రారంభం కాగానే అన్ని డివిజన్లలోనూ ఓట్లు గల్లంతయ్యాయనే ఆందోళనలు జరుగుతున్నాయి. పలు పోలింగ్ బూత్‌లలో ఓట్లు భారీగా గల్లంతయ్యాయి. ఓటు వేసేందుకు స్లిప్‌తోవచ్చిన వారికి పోలింగ్ బూత్‌లోని ఓటర్ లిస్ట్‌లో ఓటు లేదని, మరణించినట్లు చూపిస్తున్నాయంటూ వెనక్కిపంపిస్తున్నారు. కానీ వారందరి ఓట్లు ఆన్‌లైన్ లిస్ట్‌లో ఉన్నాయి. వారికి ఓటరు స్లిప్పులు కూడా పంపిణీ చేశారు. జియాగూడ్ డివిజన్‌లోని 38వ పోలింగ్ బూత్‌లో 914 ఓట్లకు గాను 667 ఓట్లు గల్లంతవ్వడం గమనార్హం. ఏళ్ల తరబడి ఓటు వేసిన వారికి ఈ సారి ఎన్నికల్లో ఓటు లేకపోవడంతో వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఓట్లు ఇప్పుడు లేకపోవడం అధికారుల పనితీరుకు నిరదర్శనంగా నిలుస్తోంది.