iDreamPost
iDreamPost
బావా.. బావా.. హైదరాబాదు నుంచి మొత్తం లగేజీ సర్దేయొచ్చుమో… అంటూ అరుచుకుంటూ లోపలికొచ్చాడు మణి
మాంచి నిద్రమత్తులో నుంచి ఉలిక్కిపడి లేచాడు కిట్టయ్య. కళ్ళు నులుముకుంటూ ఒరే మణీ.. నీకు వేళాపాళా లేదురా. ప్రశాంతంగా నిద్ర పడుతోంది. ఇప్పుడొచ్చి లేపేసావ్.. అంటూ విసుక్కున్నాడు.
ఇంకా నిద్రంటావేంటి బావా.. అక్కడ హైదరాబాదులో అంతా ఖాళీ అయిపోతేను అన్నాడు ఇంకా అదే అరుపును కంటిన్యూ చేస్తూ మణి.
ఏం ఖాళీ అయిపోయిందిరా.. అన్నాడు ఒక్కసారిగా నిద్రమత్తులో నుంచి బైటకు వస్తూ కిట్టయ్య.
అదే బావా తెలుగుదేశం పార్టీ. జీహెచ్‌యంసీ ఎన్నికల్లో అసలు బోణీ కూడా కొట్టే పరిస్థితి కన్పించడం లేదు. కనీసం కాంగ్రెస్ పార్టీయే నయం. సింగిల్ డిజిట్ అయినా ఓపెన్ చేసింది. మన చంద్రబాబు పార్టీని తెలంగాణా వాళ్ళు కనీసం గుర్తు కూడా పెట్టుకున్నదాఖలాల్లేవు బావా.
లేకపోతే 106 స్థానాల్లో పోటీ చేసినా కనీసం ఒక్కసీటు కూడా రాలేదాయె. అంతెందుకు చాలా చోట్ల అభ్యర్ధుల డిపాజిట్‌లు కూడా వెనక్కి రావంటున్నారు బావా అన్నాడు గుక్కతిప్పుకోకుండా మణి.
అదేంట్రా మరీ అంత ఘోరం జరిగిపోయిందా.. అన్నాడు కిట్టయ్య మంచం దిగుతూ.
అవును బావా.. మాట్లాడితే హైదరాబాదును అభివృద్ధి చేసింది నేనే.. నేనే.. అని చంద్రబాబు అంటుంటే ఎంత బాగుంటుంది. అటువంటిది తెలంగాణా ప్రజలు ఇలా దెబ్బేసేసారేంటి బావా.. అన్నాడు మణి విచారంగా.
కనీసం.. అయ్యో అమరావతి నుంచొచ్చేసి హైదరాబాదులోనే ఉంటున్నాడే అన్న జాలి కూడా లేదేంటి బావా.. వాళ్ళకి.
ఆంధ్రావాళ్ళు ఎక్కువగా ఉండే చోట్ల కూడా కనీసం టీడీపీ పోటీలో నిలవలేదట, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ వంటి చోట్ల కూడా టీడీపీ అభ్యర్ధులు ఘోరంగా ఓడిపోయారంట బావా. బాగా పట్టుందని చెప్పే చోట్ల కనీసం పోటీలోనైనా ఉంటే బాధ తగ్గుండేది బావా. కానీ అక్కడ కూడా టీడీపీ పోటీలో నిలవకపోతే ఈ బాధ తట్టుకోవడం చంద్రబాబుకైనా కష్టమే బా. ఇంక పాపం చినబాబు లోకేష్ ఎలా తట్టుకుంటాడో.. అంటూ తీవ్ర విచారంలో మునిగిపోయాడు మణి.
ఒరేయ్ బాబు మరీ అంత బాధపడిపోకురా.. అక్కడ అటువంటి ఫలితాలు ఉంటాయనే ఇంటి పక్కనే ఎన్నికలు జరుగుతున్నా కనీసం చంద్రబాబు ప్రచారానికి కూడా వెళ్ళకుండా పరువు కాపాడుకున్నాడురా అంటూ అసలు విషయం బైటపెట్టాడు కిట్టయ్య.
అదేంటి బా.. నేనింకా కరోనా గురించి వెళ్ళడం లేదనుకున్నాను.. ఓడిపోతామని తెలిసే బైటకెళ్ళ లేదా.. అంటూ ఆశ్చర్య పోయాడు మణి.
అసలు బాధ తెలంగాణాలో పోటీలో కూడా లేకపోవడం కాదురా.. ఇప్పుడు ఏపీలో టీడీపీ పరిస్థితిని తల్చుకుంటనే ఇంకా బాధ పెరిగిపోతుందిరోయ్ నీకు అన్నాడు కిట్టయ్య.
అదెలా బావా.. అంటూ దగ్గరకొచ్చాడు మణి.
ఏం లేదురా.. ఎవ్వరూ ఊహించని విధంగా జీహెచ్‌యంసీ ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంది. అంతకు ముందు దుబ్బాకలో విజయం సాధించింది. ఈ ఊపుతో ఇతర రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. అంటే ఏపీలో అటువంటి ప్రయత్నమే చేసిందనుకో.. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితినే.. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎదుర్కొవాల్సి వస్తుందిరా? అంటూ లోగుట్టును వివరించాడు కిట్టయ్య..
అంటే బా.. హైదరాబాదు నుంచే చంద్రబాబు తట్టాబుట్టా సర్దేయాలేమో అనుకుంటుంటే.. నువ్వేంటి బా.. ఇక్కడ కూడా అదే పరిస్థితి అన్నట్టు చెబుతున్నాం.. అంటూ బుర్రగోక్కునే పనిలో పడ్డాడు మణి.
వాడ్ని చూసి నవ్వకుండా బాత్‌రూమ్ దారి పట్టాడు కిట్టయ్య.