Idream media
Idream media
దేశానికి రాష్ట్రపతి, పంచాయతీకి సర్పంచ్, మేయర్ నగరానికి ప్రధమ పౌరుడు/పౌరురాలు. పరిధి మేరకు పరిపాలన అంతా వారి చేతిలోనే నడుస్తుంది. ప్రస్తుత కాలంలో ఒకసారి పదవి వరించిందంటే.. సదరు నాయకుడు చెప్పిందే వేదం, చేసిందే చట్టం, అధికారులు కూడా జీ హుజూర్ అనాల్సిందే. కానీ ఇందుకు విరుద్ధమైన పరిస్థితిని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ మేయర్ ఎదుర్కొన్నారు. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అనే చందంగా.. నిబంధనల ప్రకారం అధికారులు వ్యవహరించడంతో నగర ప్రధమ పౌరురాలు మొదటి రోజే ఖంగుతిన్నారు. మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మీకి జీహెచ్‌ఎంసీ అధికారులు 3.15 లక్షల రూపాయల భారీ జరిమానాతో స్వాగతం పలికారు.
గురువారం జీహెచ్‌ఎంసీ మేయర్‌గా టీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మీ ఎంపికయ్యారు. నూతన మేయర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. నగరంలో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు వెలిశాయి. సొంత డివిజన్ బంజారాహిల్స్, ఆ పక్కనే ఉన్న జూబ్లి హిల్స్‌లలో విజయలక్ష్మీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నిబంధనలు ప్రజలకు కానీ తనకు కాదనుకున్నారో ఏమో గానీ మేయర్ విజయలక్ష్మీ తాను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి తీసుకోలేదు. విజయలక్ష్మీ ఒకటి అనుకుంటే.. అధికారులు మరొకటి తలిచారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి లేదని గ్రేటర్ పరిధిలో ఏర్పాటు చేసిన అన్నింటినీ తొలగించారు. పైగా 3.15 లక్షల రూపాయల జరిమానా కట్టాలని మేయర్‌కు నోటీసులు పంపారు. ఊహించని పరిణామంతో ఖంగుతినడం మేయర్ వంతైంది. మేయర్ సీట్లో కూర్చుని రెండు రోజులు కూడా కాకముందే ఎదురైన పరిణామం విజయలక్ష్మీకి ఆ పదవిలో ఉన్నన్ని రోజులు గుర్తుండిపోతుంది.
నిబంధనలు పాటించకపోతే.. మేయర్ అయినా, సామాన్యుడైనా ఒక్కటేననేలా జీహెచ్‌ఎంసీ అధికారులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రసంశల వర్షం కురుస్తోంది. ఈ పరిణామం నూతన కార్పొరేటర్లకు కూడా ఓ హెచ్చరికలా పని చేసింది. కార్పొరేటర్ అయిన తర్వాత డివిజన్ పరిధిలో తమ ఇష్టానుసారం వ్యవహరించొచ్చనే వారు తమ భావనను మార్చుకునేలా తాజా పరిణామం ఉంది. మేయర్ ఫ్లెక్సీలే తీసేసి, ఆపై జరిమానా కూడా విధించడంతో నిబంధనలను అతిక్రమిస్తే.. తమ పట్ల కూడా అధికారులు అలానే వ్యవహరించడం ఖాయమని, జాగ్రత్తగా ఉండాలని అనుచరులను కార్పొరేటర్లు అప్రమత్తం చేస్తున్నారు.