iDreamPost
android-app
ios-app

అంచనాలకు మించి గ్రేటర్‌ పోలింగ్‌

అంచనాలకు మించి గ్రేటర్‌ పోలింగ్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో మునుపటి ఎన్నికల కన్నా ఎక్కువ పోలింగ్‌ నమోదైంది. నిన్న పోలింగ్‌ రోజున ఓటింగ్‌ మందకొడిగా సాగడం, పోలింగ్‌ సిబ్బంది ఓటర్లు లేక నిద్రించే పరిస్థితి రావడంతో గ్రేటర్‌ చర్రితలోనే అతి తక్కువ పోలింగ్‌ నమోదవుతుందనే ప్రచారం సాగింది. ఎలక్ట్రానిక్‌ మీడియా కూడా గ్రేటర్‌లో తక్కువ పోలింగ్‌ జరగబోతోందంటూ హోరెత్తించింది. ఓటర్లను బద్ధకస్తులంటూ, బాధ్యతలేని వారంటూ తిట్టిపోసింది.

తక్కువ పోలింగ్‌ జరుగుతుందేమోనన్న అంచనాతో రాజకీయ పార్టీల నేతలు కూడా ఓట్లు వేయాలంటూ ఓటర్లకు పదే పదే విజ్ఞప్తి చేశారు. పోలింగ్‌ శాతంపై నిన్న అందరూ వేసుకున్న అంచనాలను తలకిందులు చేస్తూ పూర్వపు ఎన్నికలకన్నా కొద్ది మేర ఎక్కువగానే హైదరాబాదీలు ఓట్లు వేశారు.

గ్రేటర్‌ పరిధిలో నిన్న 45.97 శాతం మేర పోలింగ్‌ నమోదైంది. 150 డివిజన్లకు గాను 149 డివిజన్లలో పోలింగ్‌ పూర్తయింది. 26వ డివిజన్‌ అయిన ఓల్ట్‌ మలక్‌పేటలో గుర్తులు తారుమారు కావడంతో రేపు పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ కూడా పోలింగ్‌ పూర్తయితే పోలింగ్‌ శాతం 45.97 సంఖ్య మరికొంత పెరగనుంది.

గ్రేటర్‌ పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే 45 శాతానికి కొంచెం అటు ఇటుగానే నమోదవుతోంది. గత నాలుగు ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ శాతం ఈ విశ్లేషణను బలపరుస్తోంది. 2002 ఎన్నికల్లో 43.27 శాతం పొలింగ్‌ నమోదవగా, 2009లో 42.92, 2016లో 45.27 చొప్పన నమోదైంది. ఈ మొత్తం ఈ సారి కొంచెం పెరిగింది. ఓల్ట్‌ మలక్‌పేట పోలింగ్‌ కూడా పూర్తయితే మొత్తం పోలింగ్‌ 47 శాతం దాటే అవకాశం ఉంది.

జీహెచ్‌ంఎసీ ఎన్నికల్లోనే కాదు లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లోనూ హైదరాబాద్‌లో పోలింగ్‌ శాతం తక్కువగానే నమోదవుతోంది. 2018 శాసన సభ ఎన్నికల్లో 50.86 శాతం పోలింగ్‌ నమోదైంది. 2019 లోక్‌ సభ ఎన్నికల్లో శాసన సభ ఎన్నికల కన్నా తక్కువగా పోలింగ్‌ నమోదుకావడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 39.46 శాతం ఓటర్లు మాత్రమే పోలింగ్‌లో పాల్గొన్నారు.