Idream media
Idream media
హోరాహోరీగా జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. విజేతలెవరో.. పరాజితులెవరో తేలిపోయింది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సీట్లు బాగా తగ్గాయి. 35 మంది సిట్టింగ్‌లు ఓడిపోయారు. అయినప్పటికీ వారే ప్రస్తుతం కార్పొరేటర్లు. అదేమిటి అని ఆశ్చర్యపోతున్నారా.?! అయితే ఇది తెలుసుకోవాల్సిందే.
ఎన్నడూ లేని విధంగా
గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఉండేది. అనంతరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఎంసీహెచ్‌గా ఉన్నప్పుడు కానీ, ప్రస్తుత జీహెచ్‌ఎంసీ చరిత్రలో కానీ పాలకమండలి గడువు ముగియక ముందే ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు. తొలిసారిగా టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీ వరకూ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ మండలిని రద్దు చేయకుండానే ఎన్నికలకు వెళ్లింది. దీంతో చట్ట ప్రకారం అప్పటి వరకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేదని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. మరో రెండు నెలలపాటు ప్రస్తుత పాలకమండలి యథాతధంగా కొనసాగనుంది. అప్పటి వరకు అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో ఇప్పుడున్న కార్పొరేటర్లు పాల్గొనే అవకాశం ఉంటుంది. అంటే వారే కార్పొరేటర్లుగా కొనసాగుతారన్న మాట.
కార్యక్రమాల్లో పాల్గొంటారా..?
తాజాగా జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 35 మందికిపైగా సిట్టింగ్ కార్పొరేటర్లు ఓడిపోయారు. పాలకమండలి గడువు ఉన్నంత వరకూ వారే కార్పొరేటర్లుగా కొనసాగుతారు కాబట్టి ఈ నేపథ్యంలో వారు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. పరాజయం బాధతో వారు రాకున్నా.. కొత్త వారిని అధికారికంగా పిలిచే అవకాశం ఉండదు. ప్రమాణ స్వీకారం అనంతరమే గెలిచిన వారు సాంకేతికంగా కార్పొరేటర్లుగా పరిగణింపబడతారు. అలాగే ప్రస్తుత పాలకమండలితో స్టాండింగ్ కమిటీ, కౌన్సిల్ సమావేశాలు యథాతధంగా కొనసాగించే వెసులుబాటు చట్టంలో ఉందని అధికారులు చెబుతున్నారు. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రూ.5600 కోట్ల తో ప్రతిపాదించిన జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ను గత నెలలో స్టాండింగ్ కమిటీ ఎదుట ఉంచారు. నిబంధనల ప్రకారం ఈ నెల 10వ తేదీ నాటికి కమిటీలో ఆమోదించి 15వ తేదీ వరకు కౌన్సిల్ ముందుంచాలి. ఎన్నికలు జరిగిన నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ నిర్వహిస్తారా..? లేదా..? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.