iDreamPost
iDreamPost
ప్రపంచ పరిణామాలు క్లిష్ట దిశలో ఉన్నాయి . ఆర్థిక సమస్యలు తీవ్రమవుతున్నట్టు కనిపిస్తోంది. తాజా పరిణామాలతో ఏకంగా జర్మనీకి చెందిన ఓ ఆర్థిక మంత్రి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. జర్మనీ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే ఫ్రాంక్ ఫర్ట్ కి చెందిన థామస్ షెఫర్ ఆత్మహత్య అక్కడి పరిస్థితులకు అద్దంపడుతోంది. ప్రధాన బ్యాంకుల హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉండటం గమనార్హం.
54 ఏళ్ల షెఫర్ జర్మనీలోని హెస్సీ రాష్ట్రానికి ఆర్థికమంత్రిగా ఉన్నారు. పదేళ్లుగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. కానీ ప్రస్తుత కరోనా నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్నది అంతుబట్టక ఆయన మానసిక ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నట్టు అక్కడి ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.
రైల్వే ట్రాక్ కి సమీపంలో షెఫర్ మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. తొలుత ప్రమాదం అనుకున్నప్పటికీ ఆత్మహత్యగా నిర్ధారించారు. ఇటీవలి పరిణామాల్లో కార్మికులు, పరిశ్రమలకు సంబంధించి కరోనా ముప్పు నుంచి ఎలా గట్టెక్కించాలనే అంశంలో ఆయన రాత్రీ పగలూ తేడా లేకుండా ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు. భార్య ఇద్దరు పిల్లలు కలిగిన షెఫర్ జర్మనీలోని సెంటరిస్ట్ పార్టీ సీడీయూ నేత.
ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న నాయకుడు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆర్థిక వ్యవస్థ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోననే కలవరం సర్వత్రా వ్యాపిస్తోంది. ప్రస్తుతం యూరప్ దేశాలన్నీ కరోనా కోరల్లో విలవిల్లాడుతున్నాయి. ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ వంటి వాటితో పోలిస్తే జర్మనీ కొంత మెరుగ్గానే ఉంది. రోగుల సంఖ్యతో పాటుగా మృతుల సంఖ్య కూడా కొంత తక్కువే అయినప్పటికీ ఆర్థికరంగం మీద పెను ప్రభావం చూపుతున్నట్టు మంత్రి ఆత్మహత్య చాటుతోంది. దాంతో కరోనా కారణంగా మృతులతో పాటుగా ఇలాంటి ఆర్థిక సమస్యలు, మానసిక ఇబ్బందులు కూడా పలువురి బలవన్మరణాలకు కారణంగా మారే ముప్పు ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి.