iDreamPost
android-app
ios-app

సొంత ఊరిపై ప్రేమ.. రూ. 2 కోట్లతో సర్కార్ బడికి ఆధునిక హంగులు అద్దాడు

సొంత ఊరిపై ప్రేమ.. రూ. 2 కోట్లతో సర్కార్ బడికి ఆధునిక హంగులు అద్దాడు

‘ ఏ దేశమేగినా, ఎందుకు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి.. భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము‘ అని ప్రముఖ రచయిత రాయప్రోలు సుబ్బారావు చెప్పినట్లు.. మనం ఎక్కడికి వెళ్లినా, ఏం చేస్తున్నా మన మూలాలు మరచిపోకూడదు. తీరం దాటాక తెప్పతగలేసినట్లు కొంత మంది చదువులు, ఉద్యోగాల నిమిత్తం పరాయి ప్రాంతాలకు వెళ్లి కన్నతల్లి, పుట్టిన ఊరిని మర్చిపోతున్నారు. మంచి హోదాలో ఉండి కూడా ఊరి కోసం, దాని బాగు కోసం ఏం చేయరు. కానీ కొంత మంది ఎక్కడకు వెళ్లినా వారికి ఊరిపైన మమకారం పోదు. ఆ ఊరి కోసం ఏదో ఒకటి చేయాలని తాపత్రయ పడుతుంటారు. ఆ కోవకే వస్తారు ప్రముఖ వ్యాపార వేత్త మధుసూదన్ గుప్తా.

తన ఊర్లో చదువుకున్న పాఠశాల పరిస్థితి అధ్వానంగా ఉందని తెలిసి.. రూ. 2 కోట్లను వెచ్చించి అత్యాధునిక సదుపాయాలను కల్పించి.. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించారు మధుసూదన్ గుప్తా. ఇంతకు ఆ స్కూల్ ఎక్కడ నిర్మించారంటే యాదాద్రి జిల్లాలో. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో మంచి బిల్డర్‌గా పేరు గాంచారు మధు సూదన్ గుప్తా. ఆయనది యాదాద్రి జిల్లా రామన్న పేట మండలం ఇస్కిల్ల గ్రామం. ఈ గ్రామంలోని విద్యార్థులు అరకొర వసతులతో అవస్థలు పడుతున్నారని తెలుసుకున్న ఆయన.. తన ఫౌండేషన్ సుమధుర ద్వారా పాఠశాల అభివృద్ధికి నడుం బిగించారు. సేవా కార్యక్రమాలు అంటే మక్కువ ఉండే ఆయనకు.. తన గ్రామంలో విద్యా సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్ని సదుపాయాలతో కూడిన పాఠశాల భవనం నిర్మించారు.

ఇందు కోసం రెండు కోట్ల రూపాయాలను వెచ్చించారు. విశాలమైన 1 4 తరగతి గదులతో పాటు కంప్యూటర్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, డైనింగ్ హాల్, రెండు అంగన్ వాడీ కేంద్రాలకు భవనాలు, వంట గదులను నిర్మించారు. రూ. 3 లక్షలతో డిజిటల్ తరగతి గదులు, గ్రీన్ బోర్డులు, క్రీడా సామాగ్రి, లైబ్రరీలో రూ. 50 వేల విలువైన పుస్తకాలు, ప్రొజెక్టర్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి సదుపాయాలు ఉన్నాయి. 11000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రాథమికోన్నత పాఠశాల భవనం నిర్మితమైంది. అలాగే ఉన్నత విద్యాభ్యాసం కోసం గ్రామాల నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు సైకిళ్లు కూడా పంపిణీ చేశారు. ఇక హైటెక్ హంగులను అద్దిన ఈ సర్కారు బడిని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ.. పుట్టిన ఊరి కోసం ఎంత చసినా తక్కువేనని అన్నారు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలిపారు.