“గంటా” వైసిపి తలుపు కొడుతూనే ఉన్నారన్నమాట..!!

సార్వత్రిక ఎన్నికలు జరిగి ఏడాది అయిపోయింది. ప్రతిపక్షం..అధికార పక్షం అయింది. అధికార పక్షం.. విపక్షం లో కూర్చుంది. అధికార వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిన టిడిపి ప్రజాప్రతినిధులకు వైసిపి అధిష్టానం ఆచితూచి జండా ఊపుతోంది. అయితే కొంతమంది పట్టువదలని విక్రమార్కుల్లా వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వైసిపి తలుపు తడుతూనే ఉన్నారు. ఈ కోవకు చెందిన నేతల్లో ముందు వరుసలో ఉంటారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. వైసీపీలో చేరేందుకు ఆయన నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారన్న విషయం తాజాగా వెల్లడైంది.

గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి ఆయన అధికార వైసిపిలో చేరేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. తాజాగా వైసీపీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గంటా ఆశలపై నీళ్లు చల్లారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గంటా శ్రీనివాసరావు పార్టీలో చేర్చుకునే లేదని స్పష్టం చేశారు. గంటా శ్రీనివాసరావు నమ్మదగిన వ్యక్తి కాదని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన్ను పార్టీలో చేర్చుకుంటామని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఒక చోట పోటీ చేసిన తర్వాత రెండో సారి అక్కడ గంటా శ్రీనివాసరావు పోటీ చేయరని వ్యాఖ్యానించారు. ఉత్తర నియోజకవర్గం లో గెలిచిన గంటా శ్రీనివాసరావు ప్రజలను పట్టించుకోకున్నా.. పోటీ చేసి ఓడిపోయిన కేకే రాజు మాత్రం నిత్యం ప్రజల్లో ఉంటున్నారని కొనియాడారు. లాక్ డౌన్ నేపధ్యంలో స్థానికంగా ఏర్పాటు చేసిన పార్టీ సేవా కార్యక్రమంలో విజయ సాయి రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు.

కాగా, గంటా శ్రీనివాసరావు చంద్రబాబు ప్రభుత్వం లో విద్యా శాఖ మంత్రి గా పని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విశాఖ లో భారీ భూ కుంభకోణం జరిగింది. దీనిపై అప్పటి ప్రభుత్వం సిట్ విచారణ చేసినా.. ఆ నివేదిక బయటకు రాలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక కొత్తగా మరో సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ బృందం ఇప్పటికే ప్రాధమిక నివేదిక ఇచ్చింది. ఈ కుంభకోణం లో గంటాదే ప్రధాన పాత్ర అనే ఆరోపణలు వచ్చాయి.

Show comments