iDreamPost
android-app
ios-app

గల్లాకు వరుస షాక్ లు..!

గల్లాకు వరుస షాక్ లు..!

తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబ యాజమాన్యంలోని అమరరాజా బ్యాటరీస్‌ కంపెనీకి రాష్ట్రప్రభుత్వం పెద్ద షాకిచ్చింది. కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించిందనేపేరుతో చిత్తూరు జిల్లాలోని ఆ కంపెనీకి చెందిన ప్లాంట్లను మూసివేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ బోర్డు (ఏపీపీసీబీ) శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అమర రాజా బ్యాటరీస్‌కు చిత్తూరు జిల్లాలోని తిరుపతి, కరకంబాడి, నూనెగుండ్లపల్లి వద్ద తయారీ యూనిట్లు ఉన్నాయి.

భూముల విషయంలోనూ వింత పోకడ..!

చిత్తూరు జిల్లాలో అమరరాజా ఇన్‌ఫ్రా టెక్‌కు ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) ఏర్పాటుకు కేటాయించిన భూమిలో 253.61 ఎకరాలను వెనక్కి తీసుకోవడానికి ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ)కి అనుమతిస్తూ గతేడాది జూలైలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌. కరికాల వలవన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అమరరాజ్‌ ఇన్‌ఫ్రా టెక్‌కు చిత్తూరు జిల్లాలో యాదమరి మండలం మజరా కొత్తపల్లి, బంగారుపాళెం మండలం నేనుగుండ్లపల్లి గ్రామాల పరిధిలో సెజ్‌ ఏర్పాటుకు 483.27 ఎకరాల భూమిని సర్కార్‌ కేటాయించింది.

ఆ సంస్థకు భూకేటాయింపు సమయంలో కుదుర్చుకున్న ఒప్పందంలో రెండేళ్లలోగా ఆ భూమిని ఉపయోగించుకోవాలి. కానీ.. సెజ్‌ ఏర్పాటై పదేళ్లయినా 229.66 ఎకరాలను మాత్రమే ఆ సంస్థ ఉపయోగించుకుంది. ఒప్పందం మేరకు ఉపాధి కల్పించడంలో విఫలమైన అమరరాజా ఇన్‌ఫ్రా టెక్‌ ఉపయోగించుకోని రూ.60 కోట్లకుపైగా విలువైన 253.61 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

2009లో కంపెనీకి మొత్తం 483.27 ఎకరాలను ఏపీఐఐసీ కేటాయించింది. ‘ఆ సంస్థ (అమరరాజా ఇన్‌ఫ్రాటెక్‌) భూములు తీసుకుని పదేళ్లవుతున్నా… ఒప్పందం ప్రకారం మొత్తం భూమిని వినియోగంలోకి తీసుకు రాలేదు. 253.6 ఎకరాలు ఖాళీగా ఉంచేసింది. ఆ భూముల్లో ప్రత్యేక ఆర్థిక మండలి(ఎస్‌ఈజెడ్‌)ని ఏర్పాటు చేస్తామని, డిజిటల్‌ వరల్డ్‌ సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పింది. రూ.2,100 కోట్ల పెట్టుబడులు పెడతామని, 20 వేల మందికి ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు. 60 కోట్ల విలువైన భూమిని ఖాళీగా వదిలేయడం ఒప్పందంలో చేసుకున్న నిబంధనల్ని ఉల్లంఘించడమే కాకుండా, ప్రజా ప్రయోజనాలకూ విరుద్ధం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పై నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది.

Also Read : సీబీఐ కస్టడీకి బొల్లినేని గాంధీ.. వెలుగులోకి రానున్న వందల కోట్ల ఆస్తులు