iDreamPost
android-app
ios-app

ప్రజా యుద్ధనౌక గద్దర్ కు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు

ప్రజా యుద్ధనౌక గద్దర్ కు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు

ప్రజా యుద్ధనౌక, విప్లవ గాయకుడు గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) ఆదివారం సాయంత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్త తెలియగానే యావత్ తెలుగు ప్రజానీకం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇది కలనా లేక నిజమా అనేది తెలుసుకోలేకపోయారు. ఇక ఆయన మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి నేరుగా ప్రజల సందర్శనార్థం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఉంచారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు ఆయన కడసారి చూపు కోసం రాష్ట్ర నలువైపుల నుంచి అభిమానులు వేలాదిగా తరలివచ్చారు.

విప్లవ గాయకుడిని కళాకారులు, సామాజిక కార్యకర్తలు కడసారి చూసి ఆయనతో ఉన్న జ్ఞాపకాలు తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు గద్దర్ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యాన్ని నింపారు. ఇక సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతమయాత్ర ప్రారంభించారు. ఈ యాత్రలో ఎందరో కళాకారులతో పాటు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నీటితో వీడ్కోలు పలికారు.

ఇక ఎల్బీ స్టేడియం నుంచి భారీ ర్యాలీగా కొనసాగిన ఈ అంతిమయాత్ర సాయంత్రం 5:30 నిమిషాలకు అల్వాల్ లోని తన ఇంటి వరకు కొనసాగింది. అనంతరం తాను స్థాపించిన మహాభోది స్కూల్ గ్రౌండ్ లో ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరిగాయి. దాని కంటే ముందు  సీఎం కేసీఆర్ గద్దర్ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన పార్థివదేహాం ముందు పుష్ష గుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని భరోసానిచ్చారు. కాగా, గద్దర్ అంత్యక్రియల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మందకృష్ణ మాదిగ ఇతర రాజకీయ నాయకులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలతో పాటు వేల సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: గద్దర్ మృతిపై లేఖ విడుదల చేసిన మావోయిస్ట్ పార్టీ