iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్ : ఏపీలో భారీ వర్షాలు, పిడుగులు.. జాగ్రత్తలు తీసుకోమంటున్న అధికారులు

  • Published Jun 06, 2022 | 10:00 AM Updated Updated Jun 06, 2022 | 10:00 AM
బ్రేకింగ్ : ఏపీలో భారీ వర్షాలు, పిడుగులు.. జాగ్రత్తలు తీసుకోమంటున్న అధికారులు

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా ప్రజలని జాగ్రత్తలు తీసుకోమని ఆదేశాలు జారీచేసింది. ఏపీలో ఉన్నట్టుండి భారీ వర్షాలు మొదలయ్యాయి. పిడుగులు పడనున్నాయి, వర్షాలు మరింతగా పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలుపుతున్నారు. విశాఖ,అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి అని విపత్తుల సంస్థ అధికారులు తెలిపారు.

వర్షాలు పడుతూ వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం విమానాశ్రయం నుండి బెంగుళూరు వెళ్ళవలసిన ఇండిగో విమానం ఆలస్యం అవుతుంది. విమానంలోనే కూర్చొని 58 మంది ప్రయాణికులు అయోమయంలో ఉన్నారు. వాతావరణం అనుకూలించకపోవటంతో పార్కింగ్ వద్దే ఉండిపోయిన విమానం. అలాగే చీరాల, ఒంగోలులో కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుండటంతో విద్యుత్ సరఫరాను ఆపేశారు అధికారులు.

కర్నూలు జిల్లా ఆలూరులో కురుస్తున్న భారీ వర్షం కారణంగా కల్లివంక వాగు పొంగి పొర్లుతుంది. వాగు వరద ఉద్ధృతికి ఏకంగా కారు కొట్టుకుపోయింది. ఆ కారులో మనుషులు కూడా ఉన్నారు. విజయనగరం జిల్లాలో కూడా పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతుంది. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇలా ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడి, విద్యుత్ సరఫరా ఆపేయడంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు.