స్నేహితుల కోసం మెగాస్టార్ సినిమా

కేవలం బిజినెస్ లెక్కల మీద బంధాలు నడిచే ఇండస్ట్రీలో స్నేహితుల కోసం ఏదైనా చేయడం అరుదుగా చూస్తుంటాం. కృష్ణ గారు నష్టపోయిన నిర్మాతల క్షేమం గురించి అలోచించి వాళ్లకు కొత్తగా డేట్లు ఇచ్చేవాళ్ళు. ఎన్టీఆర్ ఇదే తరహాలో ఆదుకున్న సందర్భాలున్నాయి. 1988లో చిరంజీవి తన ఫ్రెండ్స్ కోసం యముడికి మొగుడులో నటించారు. అప్పటికే స్టార్ హీరోగా నిర్మాతలు క్యూ కడుతున్న సమయమది. సుధాకర్, నారాయణరావు, హరిబాబులు సంయుక్తంగా నిర్మించిన ఆ ఫాంటసీ డ్రామా అద్భుతమైన బ్లాక్ బస్టర్ అందుకుంది. అంతకు ముందు దేవాంతకుడు చేసింది కూడా కేవలం నారాయణరావుతో ఉన్న స్నేహం వల్లే

ఇప్పుడు మరోసారి అదే పని చేయబోతున్నారు చిరు. ఒకప్పటి తన జోడి రాధికా స్వంత బ్యానర్ రాడార్ ఎంటర్ టైన్మెంట్ కోసం ఓ ప్రాజెక్టు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిలిం నగర్ టాక్. ఈ జోడి 80 దశకంలో ఎన్నో సూపర్ హిట్లలో పాలు పంచుకుంది. న్యాయం కావాలి లాంటి సీరియస్ సినిమాతో మొదలుపెట్టి దొంగ మొగుడు లాంటి ఊర మాస్ ఎంటర్ టైనర్ల దాకా ఎన్ని హిట్లో లెక్క చెప్పడం కష్టం. ఆఖరిసారి హీరో హీరొయిన్ గా కనిపించింది 1990లో వచ్చిన రాజా విక్రమార్కలో. ఇక రాధిక భర్త శరత్ కుమార్ తోనూ మెగాస్టార్ కు మంచి బాండింగ్ ఉంది. 1991లో రిలీజైన స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ లో వీరదాసు పాత్రలో మెయిన్ విలన్ గా నటించడం తెలిసిందే.

ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ లో రెండో అన్నయ్యగా చేసిన క్యారెక్టర్ మంచి పేరు తీసుకొచ్చింది తమిళనాట శరత్ కుమార్ సోలో హీరో అయ్యాక ఓసారి ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు ఖాళీ పేపర్ మీద డేట్లు రాసుకోమని చిరంజీవి ఇచ్చారని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం బాగా వైరల్ అయ్యింది. అప్పుడా కమిట్ మెంట్ వేరే కారణాల వల్ల నెరవేరలేదు కానీ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సాధ్యమవుతోంది. గాడ్ ఫాదర్ లో సంభాషణలతో మెప్పించిన లక్ష్మి భూపాల ఓ కొత్త కథను రాస్తున్నారట. కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటూనే ఏదో డిఫరెంట్ సబ్జెక్టు ప్లాన్ చేశారట. దర్శకుడు ఫైనల్ కాలేదు. వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ ల తర్వాత ఇది మొదలయ్యే ఛాన్స్ ఉంది

Show comments