iDreamPost
android-app
ios-app

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. పబ్‌కి వచ్చిన అమ్మాయిని కార్‌లో తీసుకెళ్లి..

  • Published Jun 03, 2022 | 7:09 PM Updated Updated Jun 03, 2022 | 7:09 PM
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. పబ్‌కి వచ్చిన అమ్మాయిని కార్‌లో తీసుకెళ్లి..

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆమ్నేషియా పబ్ లో ఇటీవల కొంతమంది పార్టీ చేసుకున్నారు. అందులో మైనర్లు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఓ మైనర్ బాలికని కొంతమంది బయటకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తాజాగా పోలీసు భరోసా కేంద్రంలో ఆ బాలిక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ బాలిక మాట్లాడుతూ.. ఆమ్నేషియా పబ్‌లో మేం పార్టీ చేసుకున్నాం. పార్టీలో కొందరు యువకులు నన్ను బెంజ్ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. కారులో నాపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. మే 28న సా.5 గంటలకి కారులో తీసుకెళ్లి రాత్రి 7 గంటలకు పబ్ దగ్గర నన్ను వదిలిపెట్టారు. పబ్ దగ్గర నన్ను దింపేసి వాళ్ళు వెళ్లిపోయారు. నాపై జరిగిన అఘాయిత్యం గురించి మా నాన్నకి చెప్పాను, నా మెడ దగ్గర తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మా నాన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు అని ఆ బాలిక తెలిపింది.

ఈ కేసు విషయంలో జూబ్లీహిల్స్ సిఐ రాజశేకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆమ్నేషియా పబ్‌ మైనర్ బాలిక కేసులో దర్యాప్తు వేగవంతం చేశాము. ఇప్పటికే బాలిక పట్ల అసభ్యంగా వ్యవహరించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాము. మైనర్‌ను కారులో ఎక్కించుకుని వెళ్లినవారిలో ప్రజాప్రతినిధుల కుమారులు ఉన్నట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. పబ్‌ నుంచి బెంజ్‌ కారులో బాలికను రోడ్ నంబర్ 36 వైపు తీసుకెళ్లారు. గంటన్నర తర్వాత మళ్లీ పబ్‌ వద్ద బాలికను వదిలేశారు. గంటన్నర పాటు కారులో చిత్రహింసలకు గురిచేసినట్లు, బాలిక మెడపై స్వల్ప గాయాలు అయినట్లు బాలిక, ఆమె తండ్రి తెలిపారు. ఈ కేసులో అనుమానితులని విచారిస్తున్నాము. తనపై అత్యాచారం జరిగిందంటూ బాలిక స్టేట్మెంట్ ఇచ్చింది. FIRలో అత్యాచారం కింద IPC 375 సెక్షన్ కింద కేసు నమోదు చేశాం. మొత్తం ఈ కేసులో 5గురి ప్రమేయం ఉంది. ఆమ్నేషియా పబ్‌లో ఎలాంటి లిక్కర్ పార్టీ జరగలేదు, ఎలాంటి న్యూసెన్స్ జరగలేదు. పబ్ బయట ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము అని తెలిపారు.

పబ్ మేనేజర్ సాయికిరణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీన 150 మంది మైనర్ లు విత్ అవుట్ ఆల్కహాల్ పార్టీ చేసుకున్నారు. మా పబ్ లో మైనర్ అమ్మాయిపై, అలాగే పార్టీకి వచ్చిన అమ్మాయిలపై ఎవరు కూడా మిస్ బిహేవియర్ చేయలేదు. మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ ఘటన బయట జరిగింది. పబ్ కు సంబందించిన సీసీ ఫుటేజ్ మొత్తం పోలీసులకు ఇచ్చాము. మైనర్ లకు ఫుడ్, స్నాక్స్ సర్వ్ చేసేందుకు మాకు పర్మిషన్ ఉంది. మైనర్ లకు ఆ రోజు మద్యం సర్వ్ చేయలేదు, అలాగే సిగరెట్ లు కూడా లోనికి అనుమతి లేదు. ఆ రోజు ఫ్రేషర్స్ డే పార్టీ కోసం గాంధీ అనే వ్యక్తి మా పబ్ ను సంప్రదించి బుక్ చేసుకున్నారు అని తెలిపారు.

ఈ ఘటనలో MIMకి చెందిన ఓ నేత, అధికార పార్టీ నేతల కుమారులు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే కారుని సీజ్ చేశారు. అయితే ఈ ఘటనపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించిన వారు ఉన్నారు కాబట్టే విచారణ సరిగ్గా చేయట్లేదని, సీసీ టీవీ ఫుటేజ్ ని బయటపెట్టాలని, గతంలో జరిగిన యాక్సిడెంట్ కేసుని కూడా అధికార నేతల కుమారుడు ఉండటంతో వదిలేశారని ఆరోపణలు చేస్తూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బయట ఆందోళనలకు దిగారు.