iDreamPost
iDreamPost
లోన్‌యాప్‌లను నిర్వహిస్తున్న ఓ నాలుగు కంపెనీల ఆరు నెలల టర్నోవర్ రూ. 21 వేల కోట్లు ఉంటుందని దర్యాప్తు అధికారులు బైటపెట్టారు. లోన్ యాప్‌ల కారణంగా పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతుండడంతో తమకు అందిన ఫిర్యాదుల మేరకు పోలీసు యంత్రాంగం ఈ యాప్‌లపై దృష్టిపెట్టింది. దీంతో వీటి లీలలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని బట్టి మొత్తం ఆరు కంపెనీలపై దర్యాప్తు చేపట్టారు. వీటిలో నాలుగు కంపెనీలు జూన్ నుంచి నవంబరు మధ్య 21 వేల రూపాయల టర్నోవర్ నడిపినట్టు తేలింది. ఈ అంకెలు చూసి దర్యాప్తు అధికారులు సైతం అవాక్కయ్యారంటున్నారు. కేవలం నాలుగు కంపెనీల లావాదేవీలే ఈ స్థాయిలో ఉంటే.. ఇటువంటి వ్యవహారాలే నిర్వహిస్తున్న మిగిలిన కంపెనీల ఆర్ధిక వ్యవహారాలు ఊహకే అందవంటున్నారు.
దేశంలో ఈ యాప్‌ల వ్యవహారాలను చక్కబెట్టే చైనాకు చెందిన కీలక వ్యక్తిని తెలంగాణా పోలీస్‌లు అదుపులోకి తీసుకున్నారు. చైనాకు పారిపోయే క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చిక్కిన ఇతడు నోరుతెరిస్తే మరిన్ని లీలలు వెలుగు చూడనున్నాయి. హైద్రాబాదు, బెంగళూరు, గుర్‌గావ్ వంటి చోట్ల వేలాది మంది ఉద్యోగులతో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి, యాప్‌ల ద్వారా లోన్‌లు పొందిన వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. దీంతో సదరు బాధితులు వీరి దెబ్బకు ప్రాణాలు తీసుకునే స్థితికి చేరిపోతున్నారు.
ఇప్పటి వరకు వెలుగుచూస్తున్న నిజాలు మరిన్ని కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఇన్ని వేల కోట్ల రూపాయలను విదేశీయులు ఇక్కడికొచ్చి టర్నోవర్ చేయగలుగుతున్నారంటే లోపం ఎక్కడుందన్న ప్రధాన ప్రశ్న తలెత్తుతోంది. అంతే కాకుండా ప్రాణాలు పిండేసి మరీ వసూలు చేస్తున్న ఈ డబ్బంతా ఎక్కడికి పోయిందన్నది కూడా తేలాల్సి ఉంటుందంటున్నారు. ప్రస్తుతం ప్రపంచం వాడుతున్న ఆయా దేశాల కరెన్సీకి పోటీగా ఆన్‌లైన్‌లో వస్తున్న కరెన్సీ ద్వారా దేశం దాటిపోయి ఉంటుందన్న అనుమానాలు కూడా లేకపోలేదు. లోతైన దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని సంచలన నిజాలు వెలుగుచూసేందుకు అవకాశం ఉందంటున్నాయి దర్యాప్తు బృందాలు.