iDreamPost
android-app
ios-app

విషాదం.. నలుగురి ప్రాణాలు తీసిన ఈత సరదా

  • Published Jun 12, 2022 | 9:00 AM Updated Updated Jun 12, 2022 | 9:00 AM
విషాదం.. నలుగురి ప్రాణాలు తీసిన ఈత సరదా

ఈత సరదా నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన ఆరుగురిలో.. నలుగురు చనిపోగా.. మరో ఇద్దరు గ్రామస్తుల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం అక్కచెరువుపాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన చింతల కౌషిక్ (16), మద్దినేని సుబ్రహ్మణ్యం (16), మద్దినేని చందనశ్రీ (16), చీమకుర్తి మండలం బూసరపల్లికి చెందిన మున్నంగి శివాజీ (12), మున్నంగి చందన (14), దర్శి మండలం బసవన్నపాలెంకు చెందిన అబ్బూరి హరి భగవాన్‌ నారాయణ (11) శనివారం అక్కంచెరువుపాలెంలోని ఓ భవనం వద్ద ఆడుకున్నారు.

సాయంత్రం అందరూ కలిసి చెరువులో ఈత కొట్టాలని భావించారు. గ్రామానికి తూర్పు దిక్కున ఉన్న చెరువు వద్దకు వెళ్లారు. కౌషిక్, సుబ్రహ్మణ్యం, శివాజీ, హరిభగవాన్‌ నారాయణ చెరువలోకి దిగి ఈతకొడుతూ ముందుకెళ్లారు. వారివెనకే చందనశ్రీ, చందనలు కూడా ఈతకొట్టేందుకు చెరువులోకి దిగారు. ముందువెళ్లిన నలుగురూ.. లోతులో మునిగిపోతూ కేకలు వేశారు. బాలికలు కూడా రక్షించాలంటూ బిగ్గరగా అరవడంతో.. ప్రసాద్ అనే వ్యక్తి బాలికలను రక్షించాడు. అతనికి ఈత రాకపోవడంతో.. మిగతా బాలురని రక్షించలేకపోయాడు.

ప్రసాద్ కేకలు వేయడంతో.. గ్రామస్తులంతా చెరువు వద్దకు చేరుకుని.. బాలురను బయటికి తీశారు. అప్పటికే చింతల కౌషిక్, మున్నంగి శివాజీ మృతి చెందగా.. కొనఊపిరితో ఉన్న మద్దినేని సుబ్రహ్మణ్యం, అబ్బూరి హరి భగవాన్‌ నారాయణను కారులో కందుకూరు ఆస్పత్రికి తరలించారు. కానీ.. అప్పటికే ఆ ఇద్దరూ కూడా చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. చందనశ్రీ, చందన ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నలుగురు బాలుర మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.