iDreamPost
iDreamPost
కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక భూ వివాదంలో ఎన్.ఓ.సీ కోసం ఏకంగా కోటి రూపాయలకు పైగా లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయర సర్వే నంబర్లు 604 నుంచి 614 వరకు ఉన్న 44 ఎకరాల భూమిలో 28 ఎకరాలకు సంబంధించి భూ వివాదం నెలకొంది. ఈ అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. కాగా ఈ వివాదాస్పద భూమిని, భూరికార్డుల్లో పేర్లు మార్చడం, పట్టాదారు పాస్‌బుక్ ఇవ్వడం కోసం తహసీల్దార్ నాగరాజు పెద్ద మొత్తంలో రెండు కోట్ల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తొలివిడతలో భాగంగా కోటి పది లక్షల నగదును నాగరాజుకు ఇవ్వడానికి అంజిరెడ్డి, శ్రీనాథ్ శుక్రవారం సాయంత్రం వచ్చారు. వీరి కదలికలపై నిఘా పెట్టిన అనిశా అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నెలరోజులుగా పలుమార్లు నాగరాజుని ఏసీబీ అధికారులు విచారిస్తూ వస్తున్నారు. ఈ సమయంలోనే తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారనే వార్త ఒక్కసారిగా సంచలనంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది.