Idream media
Idream media
భారత ఫుట్‌బాల్ లెజెండరీ ప్లేయర్,మాజీ కెప్టెన్ చునీ గోస్వామి(82) కన్నుమూశారు.ఆయన 1956 నుంచి 1964 వరకు చునీ గోస్వామి భారత జట్టు తరుపున సుమారు 50 అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడారు.1962 ఆసియా గేమ్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు ఆయన నాయకత్వంలోనే స్వర్ణ పతకం సాధించింది. అలాగే 1964 ఆసియా గేమ్స్‌లో తృటిలో బర్మా కప్ చేజిక్కించుకోవడంతో రజిత పతకంతో సరిపెట్టుకుంది.
క్లబ్ ఫుట్‌బాల్‌లో గోస్వామి ఎప్పుడూ మోహన్ బాగన్ తరపున ఆడేవాడు.తన కళాశాల రోజులలో కలకత్తా విశ్వవిద్యాలయానికి ఒకే సంవత్సరంలో ఫుట్‌బాల్ మరియు క్రికెట్ రెండింటిలోనూ కెప్టెన్‌గా వ్యవహరించాడు.1957లో తన అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్ ప్రారంభించిన గోస్వామి ఆనాటి జాతీయ జట్టు అగ్రశ్రేణి ఆటగాళ్లలో ఒకరు.కానీ అతను 1964లో తన 27 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి వైదొలిగాడు.
గోస్వామి కేవలం ఫుట్ బాల్ క్రీడాకారుడే కాదు. ఆయన విజయవంతమైన క్రికెటర్ కూడా.బెంగాల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్స్‌లో ఆడాడు.1966లో ఇండోర్‌లో సెంట్రల్ మరియు ఈస్ట్ జోన్ జట్టు తరుపున గోస్వామి ఎనిమిది వికెట్లు కూల్చి గ్యారీ సోబర్స్ కెప్టెన్సీలోని వెస్టిండీస్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఓటమిలో కీలక పాత్ర వహించాడు.1971-1972 సీజన్‌లో అవిభాజిత బెంగాల్ జట్టుకు గోస్వామి రంజీ ట్రోఫీ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. బ్రబోర్న్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో బొంబాయి చేతిలో ఓడి అతని కెప్టెన్సీలో బెంగాల్ రన్నరప్‌గా నిలిచింది.
గత కొంతకాలంగా గోస్వామి షుగర్, ప్రొస్ట్రేట్,నరాల సమస్యలతో బాధపడుతున్నారు.దీనికి తోడు వయసురీత్యా వచ్చే అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నాళ్లుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటలకు గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.కేంద్ర ప్రభుత్వం ఆయనని పద్మశ్రీ, అర్జున అవార్డుతో సత్కరించింది.ఆయన మృతిపై ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, ఆయా ఫుట్‌బాల్ క్లబ్‌ల సభ్యులు సంతాపం ప్రకటించారు.