ఒకపక్క ఎన్ఆర్సి కి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు మరి ముఖ్యంగా అస్సాం అంతా అట్టుడుకుతున్న తరుణంలో స్వయానా అస్సాం రాష్ట్రానికి ఏకైక మహిళా ముఖ్యమంత్రిగా చేసిన సైదా అన్వరా తైమూర్ పేరు ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి) లో లేకపోవడం ఇప్పుడు అస్సాంలోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మాజీ కాంగ్రెస్ నాయకురాలైన సైదా అన్వరా తైమూర్ అస్సాంలోనే కాక యావత్ భారత దేశంలోనే తొలి ముస్లిం ముఖ్యమంత్రి కావడం గమనార్హం (కాశ్మిరు కి వెలుపల ఇప్పటివరకు దేశంలోనే ఏకైక ముస్లిం మైనారిటీ ముఖ్యమంత్రి కూడా ఈమె)
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తన కుమారుని దగ్గర నివసిస్తున్న తైమూర్ పేరు ఎన్ఆర్సి లో నమోదు కాకపోవడంతో తనతో పాటు తన కుటుంబాన్ని రాష్ట్ర పౌరుల రిజిస్టర్లో నమోదు చేసుకోవడానికి ఆమె ఇప్పుడు స్వదేశానికి తిరిగి రావాలని యోచిస్తోంది. దీనిపై ఆమె మీడియా తో మాట్లాడుతూ…ఎన్ఆర్సి ముసాయిదా జాబితాలో తన పేరు లేకపోవడం విచారకరం. తాను ఆగస్టు చివరి వారంలో అస్సాంకు తిరిగి వస్తాను, ఆపై నా కుటుంబం పేరును నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి) లో చేర్చుకునే ప్రక్రియను ప్రారంభిస్తానని ఆమె ఒక టెలివిజన్ ఛానెల్‌కు తెలిపారు.
తైమూర్ 1980 డిసెంబర్ నుండి 1981 జూన్ వరకు అస్సాం రాష్టానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆమె ముఖ్యమంత్రి గా వున్న సమయంలోనే ఆస్సాం లో 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించడంతో ఆమె ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో ఆమె పిడబ్ల్యుడి మంత్రిగా పనిచేశారు.1972, 1978, 1983 మరియు 1991 సంవత్సరాల్లో రాష్ట్ర శాసనసభ సభ్యురాలిగా ఎన్నికయిన తైమూర్ 1988 లో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. అయితే సుదీర్ఘకాలం కాంగ్రెస్ లోనే కొనసాగిన ఈమె 2011 లో కాంగ్రెస్ కి రాజీనామా చేసి ఎఐయుడిఎఫ్ లో చేరారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 83 ఏళ్ల తైమూర్ తన కుమారుడితో కలిసి ఆస్ట్రేలియాలో నివసిస్తోంది. ఆ కారణంగా
తన కుటుంబాన్ని ఎన్‌ఆర్‌సిలో చేర్చడానికి దరఖాస్తును సమర్పించమని ఆమె ఒక బంధువును కోరింది.అయితే ఇక్కడ ఎన్‌ఆర్‌సి అధికారులు మాజీ ముఖ్యమంత్రి యొక్క డేటా వారి వద్ద అందుబాటులో ఉన్నప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు తమ పేర్లను ఎన్ఆర్సి ముసాయిదాలో ఏ కారణంతో చేర్చలేదో స్పష్టంగా తెలియలేదని ఎఐయుడిఎఫ్ ప్రధాన కార్యదర్శి అమీనుల్ ఇస్లాం అన్నారు
శుక్రవారం అమీనుల్ ఇస్లాం మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి తైమూర్ పేరు జాబితాలో లేదనే విషయం మీడియాలో వచ్చిన వార్తలు చూశాకే మాకు కూడా తెలిసిందన్నారు. దీనిపై మేము ఎన్‌ఆర్‌సి స్టేట్ కోఆర్డినేటర్ ప్రతీక్ హజేలాను కలసి పూర్తి వివరాలు సమర్పిస్తామన్నారు. గౌహతిలో తైమూర్ కి చెందిన ఆమె నివాసంలో ఎవరూ నివసించడం లేదు ప్రస్తుతం అది ఖాళీగా వుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్‌ఆర్‌సి ముసాయిదా చాలా లోపభూయిష్టంగా ఉందని మొదటినుండి దీనిమీద ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలనుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమౌతోంది. దానికి కారణం గత సంవత్సరం జూలై 30 న విడుదల చేసిన ఎన్‌ఆర్‌సిలో 3.29 మంది దరఖాస్తుదారులలో 2.89 కోట్ల మంది పేర్లు మాత్రమే ఉన్నాయి. ఈ జాబితాలో 40 లక్షల మంది పేర్లు గల్లంతయ్యాయి. అలా ఎన్‌ఆర్‌సి ముసాయిదా జాబితాలో పేర్లు లేని వారిలో సాక్షాత్తు భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ మేనల్లుడు మిగతా కుటుంబ సభ్యులతో పాటు కార్గిల్ యుద్ధంలో పాల్గొనడం తో పాటు ఎన్నో ఏళ్ళు భారత సైన్యంలో పనిచేసిన కొందరు మాజీ సైనికుల పేర్లు కూడా గల్లంతు కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
దీనిపై ఎన్‌ఆర్‌సి రిజిస్టర్ రాష్ట్ర సమన్వయకర్త ప్రతీక్ హజేలా మాట్లాడుతూ, జాబితాలో చోటు దక్కని 40,07,707 మంది తిరిగి తాము తమ గుర్తింపుని ధృవీకరించే పత్రాలను ఎన్‌ఆర్‌సి రిజిస్టర్ కి సమర్పించడం ద్వారా తమ గుర్తింపుని నమోదు చేసుకోవచ్చని పౌరులకు సూచించారు.