iDreamPost
android-app
ios-app

న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసిన ఆహారం.. ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్న కేంద్ర సంస్థ

న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసిన ఆహారం.. ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్న కేంద్ర సంస్థ

న్యూస్ పేపర్ చదివితే సమాజం పట్ల అవగాన, జ్ఞానం పెరగడంతో పాటు మరెన్నో లాభాలుంటాయి. కానీ ఇప్పుడు ఇదే న్యూస్ పేపర్ తో ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని కేంద్ర సంస్థ వెల్లడించింది. న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించింది. న్యూస్ పేపర్ లో ఫుడ్ ప్యాక్ చేయడం, నిల్వ చేయడం వల్ల న్యూస్ పేపర్ లో ఉన్న రసాయనాలు, బాక్టీరియా ఆహారం ద్వారా శరీరంలోకి చేరి అనారోగ్యానికి గురయ్యేలా చేస్తాయని వెల్లడించింది. ఆహార పదార్థాల ప్యాకింగ్ కోసం వార్తా పేపర్లను ఉపయోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని వ్యాపారులను, వినియోగదారులను కేంద్రం సంస్థ కోరింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఈ మధ్యకాలంలో రోడ్డు పక్కన తోపుడు బళ్లపై తినుబండారాలు తినే వారి సంఖ్య పెరిగిపోతోంది. అలాంటి వారికి కేంద్ర సంస్థ షాకింగ్ న్యూస్ తెలిపింది. సాధారణంగా రోడ్ల పక్కన చిరుతిల్లు, స్నాక్స్ అమ్మే వ్యాపారులు ఆయా ఆహార పదార్థాలను వార్తా పేపర్లలో చుట్టి ఇవ్వడం మనం చూసే ఉంటాం. దీని వల్ల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్చరించింది.న్యూస్ పేపర్ల ప్రింటింగ్ ఇంక్‌లలో సీసం, ఇతర భారీ లోహాలతో సహా రసాయనాలు ఉండవచ్చని, ఇవి ఆహారంలో కలసి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెల్లడించింది.

అంతేకాకుండా పరిసరాల్లోని బ్యాక్టీరియా, వైరస్‌ వంటి వ్యాధికారక క్రిములు న్యూస్‌ పేపర్లపైకి చేరి ఆహారంలోకి ప్రవేశించి అనారోగ్యాలకు కారణమవుతాయని తెలిపింది. న్యూస్‌ పేపర్లను ఆహార పదార్థాల ప్యాకేజింగ్ మెటీరియల్‌గా ఉపయోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని దేశంలోని ఆహార పదార్థాలను అమ్మే వ్యాపారులు, సరఫరాదారులను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కోరింది. సురక్షితమైన, ఆమోదించిన ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లతో పాటు ఫుడ్-గ్రేడ్ కంటైనర్‌లను మాత్రమే ఆహార పదార్థాల ప్యాకేజింగ్ కోసం ఉపయోగించాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సూచించింది.