iDreamPost
iDreamPost
సినిమా రంగమంటేనే విచిత్రాలకు నెలవు. ఒక సినిమాలో అనామకులుగా ఉన్న నటీనటులు అతి తక్కువ సమయంలోనే స్టార్లు గా ఎదగడం చూసాం. కొందరికి ఏళ్ళు పట్టి లేట్ ఏజ్ లో హీరోలు కావడమూ అనుభవమే. ఇలాంటి ఘటనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కానీ నటనతో సంబంధం లేని కెరీర్లో సెటిల్ కావడం మాత్రం అరుదు. అలాంటి ఉదాహరణ చూద్దాం. 1996లో దర్శకరత్న దాసరి నారాయణరావు గారు అందరూ కొత్త వాళ్ళతో ఓ ప్రయోగాత్మక చిత్రం తీయాలని ప్లాన్ చేసుకున్నారు. అప్పటికే కొంత ఫామ్ తగ్గి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే కసితో ఉన్నారు. దీని కన్నా ముందు ఒరేయ్ రిక్షాతో ఓ బ్లాక్ బస్టర్ హిట్, ఆ తర్వాత రాయుడుగారు నాయుడుగారు ఫ్లాప్ ఖాతాలో ఉన్నాయి. ఈసారి బయటికి వాళ్ళతో తీద్దామని కొత్త యాక్టర్స్ కోసం యాడ్ ఇచ్చారు.
వేలల్లో అప్లికేషన్లు వచ్చాయి. తన టీమ్ తో కలిసి రోజుల తరబడి వాటిని ఫిల్టర్ చేసి కొందరిని ఎంపిక చేసి వాళ్లకు కొన్ని టెస్టులు పెట్టారు. అందులో ఫైనల్ గా వంశీ, సుమ, కావ్య, రాజు అనే నలుగురు యువతీ యువకులను సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు కాకుండా మరో రెండు డజన్ల నటీనటులను సపోర్టింగ్ రోల్స్ లో తీసుకున్నారు. టైటిల్ కళ్యాణ ప్రాప్తిరస్తు. మంచి ఫామ్ లో ఉన్న కోటికి స్వరాలు సమకూర్చే బాధ్యత అప్పజెప్పారు. మోహన్ బాబు, వెంకటేష్, వినోద్ కుమార్, మురళి మోహన్, ఈవివి, బి గోపాల్, ఎస్ గోపాల్ రెడ్డి, డి రామానాయుడులతో పాటు అక్కినేని నాగేశ్వరావు గారిని విశిష్ట అతిధిగా పిలిచి ఘనంగా ఓపెనింగ్ చేశారు. ఏడు నెలల పాటు షూటింగ్ కొనసాగింది. కొత్త వాళ్ళతో దాసరి రిస్క్ చేస్తున్నారని కామెంట్స్ వచ్చాయి. అవేవి ఆయన లెక్క చేయలేదు.
కథ విషయానికి వస్తే ఓ టీవీ యాంకర్ ఆమె సహోద్యోగి ప్రేమించుకుంటారు. కానీ ఆ ఛానల్ కూతురు మధ్యలో వచ్చి ఆ అబ్బాయి మీద మనసుపడి కుట్ర చేసి తనను పెళ్లి చేసుకునేలా చేస్తుంది. ఆ తర్వాత స్టోరీ కొత్త మలుపులు తిరిగి ఆఖరికి ఆ ప్రేమ జంట మళ్ళీ ఒకటవ్వడమే క్లైమాక్స్. అయితే ఎంత వైవిధ్యం ఉన్నప్పటికీ ట్రీట్మెంట్ పరంగా దాసరి గారి పాత స్కూల్ తరహాలోనే సాగడంతో కొత్తదనం మిస్సయ్యి ప్రేక్షకుల అంచనాలను కల్యాణ ప్రాప్తిరస్తు అందుకోలేకపోయింది. ఏవిఎస్, బ్రహ్మానందం, బాబూమోహన్, ఆలీ లాంటి సీనియర్లు కూడా ఇందులో నటించారు. తోటపల్లి మధు సంభాషణలు అందించారు. ఈ కళ్యాణ ప్రాప్తిరస్తు ద్వారా హీరోగా పరిచయమైన ఓ అబ్బాయే ఇప్పటి స్టార్ స్టోరీ రైటర్ కం నా పేరు సూర్య దర్శకుడు వక్కంతం వంశీ. ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒకరే దశాబ్దానికి పైగా స్టార్ యాంకర్ గా నెంబర్ వన్ చైర్ లో ఉన్న సుమ. సినిమా బ్లాక్ బస్టర్ కాకపోయినా వీళ్ళ కెరీర్లు మాత్రం తారాస్థాయికి వెళ్లాయి. అదే సినిమా లీలంటే.