iDreamPost
android-app
ios-app

తెలంగాణలో ఐదు ప్రైవేట్‌ వర్శిటీలకు అనుమతి: నాలుగింటికి ఇంకా అనుమతి లేదు

తెలంగాణలో ఐదు ప్రైవేట్‌ వర్శిటీలకు అనుమతి: నాలుగింటికి ఇంకా అనుమతి లేదు

తెలంగాణలో ఐదు ప్రైవేట్‌ యూనివర్శిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందుకు సంబంధిత ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌(రాజపత్రం) జారీ చేసింది. గత ఫిబ్రవరిలో మొత్తం తొమ్మిది ప్రైవేట్‌ యూనివర్సిటీల స్థాపనకు తాత్కాలిక అనుమతి(లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌) జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో దానికి ఒక చట్టం రూపొందించాల్సి ఉంది. ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. చట్టం చేయాలంటే అసెంబ్లీలో బిల్లులు పెట్టాలి. దానిపై అసెంబ్లీలో చర్చ జరిగి ఆమోదం పొందితే చట్టం అవుతుంది. కానీ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.

సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు, అత్యవసర అయితే ప్రభుత్వాలు ఇలా ఆర్డినెన్స్ తీసుకొస్తాయి. రాజ్యాంగంలో ఉండే క్లాజులను ఉపయోగించి ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు యత్నిస్తాయి. అయితే బిల్లు అసెంబ్లీ, పార్లమెంట్ లో ఆమోదం పొందిన తరువాత గవర్నర్, రాష్ట్రపతి అమోదం తెలిపితేనే ఆ చట్టం అమలులోకి వస్తుంది. అదే రూల్ ఆర్డినెన్స్ కి కూడా వర్తిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంది. ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీకొచ్చిన ఆర్డినెన్స్ ను రాష్ట్ర గవర్నరు తమిళ సై ఆమోద ముద్ర వేయడంతో ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది.

అనుమతి ఇచ్చిన ఐదు ప్రైవేట్ వర్శిటీలు ఇవే..

1.టెక్‌ మహేంద్ర(బహుదూర్‌పల్లి) 2.వోక్సన్‌(సదాశివపేట),
3.మల్లారెడ్డి(మైసమ్మగూడ, దూలపల్లి)
4.ఎస్‌ఆర్‌(అనంతసాగర్‌, వరంగల్‌)
5.అనురాగ్‌ విశ్వవిద్యాలయం(వెంకటాపూర్‌, ఘట్‌కేసర్‌)

అనుమతి పొందిన వాటిలో మంత్రి మల్లారెడ్డికి చెందిన యూనివర్శిటీ

అయితే ఇప్పుడు అనుమతి అభించిన యూనివర్శిటీల్లో తెలంగాణ కార్మిక,ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన వర్శిటీ ఉంది. మల్లారెడ్డి విశ్వవిద్యాలయం కొత్తది. తొలుత అది మహిళా యూనివర్శిటీగా అనుమతి తెచ్చుకున్నా, తర్వాత జనరల్‌ వర్శిటీగా మారింది. ఇప్పటికే మల్లారెడ్డి గ్రూపునకు ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలలో కొంత స్థలాన్ని కేటాయించి కొత్తగా విశ్వవిద్యాలయం(గ్రీన్‌ఫీల్డ్‌) నెలకొల్పుతోంది. వోక్సన్‌ సంస్థ ఆర్కిటెక్చర్‌, డిజైన్‌ లాంటి కోర్సులను నిర్వహిస్తుండగా ఇకపై ఇంజినీరింగ్‌ సహా మరిన్ని కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. టెక్‌ మహేంద్ర గ్రూపు దశాబ్దం నుంచే జెఎన్‌టియు(హెచ్‌)తో ఒప్పందం కుదుర్చుకొని ఇంజినీరింగ్‌ కోర్సులను అందిస్తోంది. హైదరాబాద్‌ శివారులో ఉన్న అనురాగ్‌ కళాశాల, వరంగల్‌లోని ఎస్‌ఆర్‌ సంస్థలు ఇంజినీరింగ్‌ కళాశాలలను నడుపుతున్నాయి. విద్యా సంవత్సరం(2020-21)లోనే ఈ వర్శిటీలన్నీ తరగతులను ప్రారంభించనున్నాయి. జెఈఈ మెయిన్‌ లేదా ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

వీటికి ఇంకా అనుమతి లభించలేదు..

1.గురునానక్‌(ఇబ్రహీంపట్నం)

2.ఎంఎన్‌ఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం(సంగారెడ్డి), 3.శ్రీనిధి(ఘట్‌కేసర్‌)

4. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌(నిక్మార్‌-శామీర్‌పేట)

అయితే ఈ నాలుగు యూనివర్శిటీలకు ఫిబ్రవరిలో లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ ఇచ్చినా ప్రస్తుతం అనుమతి లభించలేదు. వాగ్దేవి, విజ్ఞాన్‌ గ్రూపు, అమిటీ, రాడ్‌క్లిప్‌ తదితర విద్యాసంస్థలూ అనుమతుల కోసం దరఖాస్తు చేసిన వాటిల్లో ఉన్నాయి.

చట్టం ప్రకారం 25 శాతం సీట్లు స్థానికులకే

తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల చట్టం(2018) ప్రకారం మొత్తం సీట్లలో 25 శాతం సీట్లను స్థానికులకు కేటాయించాలి. అంటే తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు రిజర్వేషన్‌ ఇవ్వాలి. స్థానికులుగా పరిగణించాలంటే రాష్ట్రంలో రెండేళ్లు చదివితే చాలు. ఇంటర్మీడియట్‌ చదివినా స్థానిక కోటా కింద సీట్లు పొందొచ్చు. ఫీజు విషయంలో మాత్రం ఎటువంటి రాయితీలు ఉండవు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి