LGBTQIA+లను గౌరవంగా సంబోధించాల్సిందే! పద కోశం విడుదల చేసిన తమిళ సర్కారు

  • Published - 07:55 PM, Fri - 26 August 22
LGBTQIA+లను గౌరవంగా సంబోధించాల్సిందే! పద కోశం విడుదల చేసిన తమిళ సర్కారు

దేశంలోనే తొలిసారిగా తమిళనాడు ప్రభుత్వం LGBTQIA+ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులను గుర్తించడానికి ప్రత్యేక పదకోశాన్ని ఏర్పాటు చేసింది. తమిళనాడు సాంఘిక సంక్షేమ, స్త్రీ సాధికారతా శాఖ ఈ గ్లాసరీని (glossary) పబ్లిష్ చేస్తూ జీవో విడుదల చేసింది. ట్రాన్స్ జెండర్లు, ట్రాన్స్ సెక్సువల్ వ్యక్తుల హక్కులు కాపాడేందుకు ఒక విధానాన్ని తయారు చేయాలంటూ మద్రాస్ హైకోర్టు జూలైలో జారీ చేసిన ఆదేశాలను అనుసరించి ఈ పదకోశాన్ని ప్రచురించారు. ఇందులో లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వెషనింగ్, ఇంటర్ సెక్స్ (LGBTQIA+) కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులను సంబోధించే ఇంగ్లీషు పదాలకు సమానమైన తమిళ పదాలుంటాయి. ఇకపైన ఈ పదాలనే అన్ని చోట్లా అధికారికంగా వాడాల్సి ఉంటుంది.

దీంతో పాటు LGBTQIA+ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు, వారి కోసం పని చేసే సంఘాలను వేధింపుల నుంచి కాపాడే దిశగా తమిళనాడు ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీస్ చట్టాల్లో మార్పులు చేసింది. ఈ సవరణ కూడా మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకే జరిగింది.

అయితే ట్రాన్స్ జెండర్లపై విధాన రూపకల్పనకు ఆరు నెలల గడువు కావాలని తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకు విన్నవించుకుంది. కానీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేష్ ఇందుకు ఒప్పుకోలేదు. LGBTQIA+ కమ్యూనిటీ చాలా కాలంగా వివక్ష ఎదుర్కొంటోందని, వాళ్ళకు సంబంధించిన విధానాల ఏర్పాటులో ఎంతమాత్రమూ తాత్సారం చేయరాదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఒక LGBT కేసులో తీర్పు చెప్పే ముందు వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకుని జస్టిస్ వెంకటేష్ వార్తల్లో నిలిచారు.

Show comments