Idream media
Idream media
దెయ్యాల సినిమా అంటే డబ్బులిచ్చి భయపడి చావడం. వూహ వచ్చిన తర్వాత చూసిన మొదటి సినిమా జగమే మాయ. మురళిమోహన్, గిరిబాబుల మొదటి సినిమా ఇది. సునంద హీరోయిన్. తర్వాత ఈమె ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తు. నేను పుట్టక ముందు బీస్‌సాల్ బాద్ అనే హిందీ సినిమా వచ్చింది. అది చూస్తే భయపడకుండా బయటికి రావడం అసాధ్యమని మా నాన్న చెప్పేవాడు. భయపడని వారికి బహుమతి కూడా ప్రకటిస్తే దాన్ని ఎవరూ గెలవలేదట.
దేవుడు లేడని తెలిసినా పూజిస్తాం. దెయ్యం లేదని తెలిసినా భయపడతాం. రెంటికీ కారణం భయమే. రెంటిని క్యాష్ చేసుకోవడం సినిమా స్పెషాలిటీ. దెయ్యం స్పెషాలిటీ ఏమంటే నూరు శాతం స్త్రీ అయి వుంటుంది. మగ దెయ్యాలు సినిమాల్లో వర్కౌట్ కావు. కానీ జగమే మాయలో మురళిమోహన్ చచ్చి దెయ్యమై భయపెడుతూ వుంటాడు. హీరోయిన్ , విలన్ గిరిబాబుతో కుమ్మక్కై హీరోని చంపేస్తుంది. వాళ్లిద్దరినీ దెయ్యం భయపెడుతుంది.
ఏడో తరగతి చదువుతున్న నేను , శ్రీధర్ ఇంకొందరు మిత్రులతో కలిసి రాయదుర్గంలోని అజీజియా టాకీస్‌కు వెళ్లాం. అసలా థియేటరే ఊరికి దూరంగా బూత్ బంగ్లాలా వుండేది. భయం గ్యారెంటీ అని ముందే తెలుసు కాబట్టి అందరం భయంగా బెంచీల్లో దగ్గరగా సర్దుకుని కూచున్నాం. మురళిమోహన్, హీరోయిన్ కలుసుకున్నారు. పాట పాడుకున్నారు. దెయ్యం మాత్రం రాలేదు. హారర్ సినిమాలో దెయ్యం Entry లేటయితే భలే బోర్. హీరోని హత్య చేసిన తర్వాత రిలాక్స్ అయ్యాం. ఇక చచ్చినట్టు దెయ్యం రావాల్సిందే కదా! మ్యూజిక్ డైరెక్టర్ సత్యం వాయించడం Start చేశాడు. ఆ దెబ్బకి వణుకుతూ కూచున్నాం. దెయ్యం కనపడేసరికి కెవ్వు కేక.
హారర్ సినిమాల ప్రత్యేకత ఏమంటే దెయ్యం ఉన్న ఇంట్లో అలాగే భయపడుతూ వుంటారు తప్ప బయటికి రారు. గిరిబాబు, సునంద ఇద్దరూ కేకలు పెడుతూ అరుస్తూ ఉంటారు. మేము అసలే చిన్నపిల్లలం ఆ ఎఫెక్ట్‌కి వణుకుతున్నాం. అంటే ఆ రోజుల్లో రాయదుర్గం థియేటర్లలో ఒక సౌలభ్యం వుండేది. సినిమాని ప్రశాంతంగా చూడనివ్వకుండా చాలా శక్తులు రంగప్రవేశం చేసేవి.
మేము ఎక్కువ సేపు భయపడకుండా చేయడానికి ఒకడు గంప చంకలో పెట్టుకుని “ఎవరికయా చకిలాలు” అని అరుస్తూ వచ్చాడు. చకిలం కొనుక్కున్నాం. పళ్ల కింద కరకర శబ్దం కూడా భయపెడుతూ వుంది.
కాసేపటికి ఇంట్లో ఇంకో దెయ్యం వచ్చింది. అదే సమయానికి ఒక నల్లటి నీడ వచ్చి సోడా సోడా అని అరిచింది. గజగజ వణికాం. కొంత మంది ప్రేక్షకులు భయాన్ని ఎంజాయ్ చేస్తూనే సోడాలు కుయ్యిమనిపించి గటగట తాగారు. మొత్తానికి సినిమా చివర్లో దెయ్యాలు లేవు, ఆ వేషంలో వున్నది హీరోనే అని లాజికల్‌గా తేల్చేశారు.
సినిమా వదిలేసరికి రాత్రి పది గంటలు. రాయదుర్గం మున్సిపాలిటీ వాళ్లు ఉదార హృదయులు. అప్పట్లో టీచర్లకి జీతాలు ఇచ్చేవాళ్లు కాదు. సక్రమ జీతాలు లేకపోయే సరికి ఫ్రస్ట్రేషన్‌తో వాళ్లు పిల్లల్ని ఉతికేవాళ్లు. ప్రజల్ని చీకట్లో ఉంచడం ప్రభుత్వాల లక్ష్యం. రోడ్డు మీద లైట్లు వెలిగేవి కావు. ఒకటో రెండో వెలిగితే అవి క్షణానికోసారి ఆరిపోయి భయపెట్టేవి. రోడ్డు పక్కన కంకర గుట్ట వుండేది. కంకర తోలిన మూడేళ్లకి రోడ్డు వేసేవాళ్లు. చీకట్లో పిల్లలమంతా కలిసి కిలో మీటర్ దూరం నడవాలి, అది దెయ్యం సినిమా చూసి.
ఇవన్నీ ఒక ఎత్తైతే దారి పొడవునా కుక్కలే. గుంపులు గుంపులుగా సంచరిస్తూ గుర్రుమనేవి. పారిపోతే వెంట పడేవి. మా నిక్కర్లు , అవతారాలు చూసి దొంగలనుకునేవో ఏమో, నిద్రపోయేవి కూడా లేచి చెడిపోయిన రేడియోలా అరిచేవి. ఇన్నింటిని దాటుకుని ఇంటి వరకూ వస్తే , రాత్రి నిద్ర పట్టలేదు. దెయ్యాలు కలలోకి వస్తున్నాయి.
ఆ తర్వాత చాలా హారర్ సినిమాలు చూశాను. పెద్దగా భయపడింది లేదు. తర్వాత జర్నలిజంలోకి వచ్చి రాజకీయ నాయకుల్ని చూశాను. హారర్ సినిమా కంటే ఎక్కువ భయపెట్టారు.