నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అలానే వాహనాల్లో సైతం వివిధ కారణాలతో మంటలు చేలరేగుతుంటాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో మంటల్లో కాలి బూడిదై పోతున్నారు. మరెందరో కాలిన గాయాలతో జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. ముఖ్యంగా బస్సులో జరిగి అగ్నిప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిలుస్తున్నాయి. గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో జబర్ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై దాదాపు 40 మంది మృతి చెందారు. అప్పట్లో ఆఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తాజాగా మరో ఘోర బస్సు ప్రమాదం మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 25 మంది సజీవ దహనమయ్యారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…
శనివారం మహారాష్ట్రలో32 మంది ప్రయాణికులతో నాగపూర్ లోని యావత్మాల్ నుంచి పుణెకు బస్సు బయలు దేరింది. ఇక శనివారం వేకువజామున 2 గంటల సమయంలో బస్సులో మంటలు చేలరేగాయి. బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న ఈ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే బస్సు కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో బస్సులోని 25 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని బుల్దానా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
టైర్ పేలి డివైడర్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. 25 మంది ప్రయాణికులు పూర్తిగా కాలిపోవడంతో గుర్తి పట్టని విధంగా మారిపోయారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పుడు తమ ఆలోచనంతా వారి కుటుంబాల గురించేనని ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ ఘటనపై బుల్దానా జిల్లా ఎస్పీ కీలక విషయాలు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, ప్రస్తుతం మృతదేహాలను గుర్తించి, వారి కుటుంబాలకు అప్పగించడానికే తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్పీ తెలిపారు.