iDreamPost
iDreamPost
థియేటర్ల రీ ఓపెనింగ్ ప్రశ్నార్థకంగా మారుతున్న వేళ నిన్న మొన్నటి దాకా బెట్టు చేసిన కొందరు నిర్మాతలు ఒక్కొక్కరుగా ఓటిటి దారి పడుతున్నారు. నిన్న విడుదలైన అమితాబ్ బచ్చన్ ‘గులాబో సితాబో’ రివ్యూస్ పరంగా అంత గొప్ప ఫీడ్ బ్యాక్ తెచ్చుకొనప్పటికి ప్రైమ్ అకౌంట్ ఉన్నవాళ్ళతో పాటు ఇతర ఆన్ లైన్ మార్గాలు తెలిసిన వాళ్ళు తాపీగా ఇంట్లోనే చూసేశారు. ఇప్పుడు అందరి కన్ను 19న రాబోయే కీర్తి సురేష్ ‘పెంగ్విన్’ మీద ఉంది. స్టార్ హీరోయిన్ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఒక్క తెలుగు ట్రైలరే కేవలం 24 గంటల్లో 8 మిలియన్ వ్యూస్ రాబట్టుకోవడం చూస్తే ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది.
దాని తర్వాత సత్యదేవ్ నటించిన మలయాళం రీమేక్ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ నెట్ ఫ్లిక్స్ ద్వారా రాబోతోంది. కేరాఫ్ కంచెరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా డైరెక్టర్ కావడంతో దీనికి హైప్ బాగానే ఉంది. ఇవిలా ఉండగా సత్యదేవ్ నటించిన మరో సినిమా ’47 డేస్’ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో రానున్న ఈ మూవీలో పూజా ఝావేరి హీరోయిన్. సంగీత దర్శకుడు రఘు కుంచె నలుగురు నిర్మాతల్లో ఒకరు. ఇది వచ్చే నెల మొదటవారం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అభిషేక్ బచ్చన్, ఇలియానా జంటగా నటించిన ‘బిగ్ బుల్’ ని అన్ని ప్రధాన భారతీయ భాషల్లోకి అనువదించి డిజిటిల్ రిలీజ్ చేసేలా నిర్మాత అజయ్ దేవగన్ స్ట్రీమింగ్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్.
తెలుగులో స్టార్లు నటించిన క్రేజీ చిత్రాలేవీ ఓటిటి రిలీజ్ కన్ఫర్మ్ చేయలేదు కానీ పరిణామాలు చూస్తుంటే మాత్రం ఒకటో రెండో తమ నిర్ణయం మార్చుకున్నా ఆశ్చర్యం లేదు. మరోవైపు కేంద్రం నుంచి థియేటర్లు తెరిచే దిశగా ఎలాంటి సూచనలు అందటం లేదు. అసలు ఆ ఆలోచనే లేదనేలా ఉంది తీరు. ఏతావాతా దసరా అయ్యేదాకా పరిస్థితి ఇలాగే కొనసాగేలా ఉంది. ప్రధాన నగరాల్లో కరోనా అదుపులోకి రాకపోవడమే కాక కేసులు తగ్గుదల లేకపోవడం దీనికి కారణం. అప్పటిదాకా ఎన్నెన్ని ఓటిటి రిలీజులు చూడాల్సి వస్తుందో మరి. మరీ ఇంతలా ఇంట్లో వినోదానికి జనం అలవాటు పడినా కష్టమే. రేపు హాళ్లు తెరిచాక వాటి యజమానులకు ఇబ్బందులు తప్పేలా లేవు.