iDreamPost
iDreamPost
కోవిడ్ 19ను ఎదుర్కొవడానికి వ్యాక్సిన్ ప్రధానమని ఇప్పటికే నిపుణులు తేల్చారు. దీంతో ఈ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించడానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు సిద్ధమయ్యాయి. సన్నాహాలు పూర్తయ్యాక నాలుగైదు దేశాల్లో వ్యాక్సినేషన్ కూడా ప్రారంభమైంది. ప్రపంచం మొత్తం మీద అతి పెద్ద వ్యాక్సిన్ కొనుగోలుదారుగా నిలిచిన మన దేశంలో కూడా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధం చేసారు. ఇప్పటికే ఎవరెవరికి వ్యాక్సిన్ ఇవ్వాలి, వాళ్ళ వద్దకు ఎలా చేర్చాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే రోడ్‌మ్యాప్ సిద్ధమైంది. దీంతో డ్రై రన్ పేరిట దాదాపు వందకుపైగా జిల్లాల్లో ఈ పరిశీలక కార్యాచరణకు సిద్ధపడ్డారు.
ఆ తరువాత స్టెప్‌గా డ్రైరన్ పేరిట శనివారం మరో అంకానికి తెరతీసారు. దేశ వ్యాప్తంగా అన్ని ముఖ్యపట్టణాలకు వ్యాక్సిన్ చేరవేసేందుకు కార్యాచరణ అమలు చేసారు. ఇది ఒకరకంగా మాక్‌డ్రిల్‌గా చెప్పొచ్చు. ఈ డ్రై రన్ ద్వారా వ్యాక్సిన్ రవాణా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్టోరేజీ జాగ్రత్తలు, వ్యాక్సినేషన్, సిబ్బందికి ఉన్న అవగాహన తదితర అంశాలను నిపుణుల బృందం పర్యవేక్షించి నివేదికను సిద్ధం చేయనుంది. దీని ద్వారా వెల్లడైన అంశాలను పరిగణనలోకి తీసుకుని లోపాలను సరిదిద్దుకుంటారు. వారం పదిరోజుల్లోనే టీకా పంపిణీ ప్రారంభమవుతుందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రై రన్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇదిలా ఉండగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా 96వేల మంది ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ పూర్తయింది. 85 కోట్ల సిరెంజిలను కూడా సిద్ధం చేసారు. వ్యాక్సినేషన్ మొదటి ప్రాధాన్యంలో భాగంగా కోవిడ్ వారియర్లకు, వృద్ధులకు టీకాలు వేయనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. కోవిషీల్డ్‌కు ఇప్పటికే అనుమతులు రాగా, భారత్ బయోటెక్ సిద్ధం చేస్తున్న కోవాగ్జిన్‌కు కూడా అనుమతులు పొందే క్రమంలో ఉంది. దేశంలో ఈ రెండు వ్యాక్సిన్‌లను పంపిణీ చేయనున్నారు.
ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా ఇప్పటికే కోవిడ్ పాజిటివ్ కేసులు కోటిని దాటేసాయి. బ్రిటన్ నుంచి వచ్చిందని భావిస్తున్న కొత్త స్ట్రెయిన్ కేసులను కూడా గుర్తించడం జరిగింది. దీంతో కేంద్రం సూచనల మేరకు ఆయా రాష్ట్రాలు అప్రమత్తమై కొత్త కేసులను గుర్తించేందుకు విస్తృతంగా చర్యలు చేపట్టారు.