iDreamPost
android-app
ios-app

రైతన్న పోరుబాట.. కాసేపట్లో చక్కా జామ్‌

రైతన్న పోరుబాట..  కాసేపట్లో  చక్కా జామ్‌

నూతన సాగు చట్టాలను రద్దు చేయడం, పంటల కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్లతో రైతులు చేస్తున్న ఉద్యమం గణతంత్ర దినోత్సవం తర్వాత మరో దశకు చేరిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఢిల్లీ సరిహద్దుల్లో భైటాయించిన రైతులు శాంతియుతంగా నిరసన తెలపగా.. ఇప్పుడు ప్రత్యక్ష పోరు సాగిస్తున్నారు. వివిధ మార్గాల్లో తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. మహా పంచాయత్‌లు, ఖాఫ్‌ పంచాయత్‌లు నిర్వహిస్తున్న రైతు సంఘాల నేతలు, భారతీయ కిసాన్‌ యూనియన్‌నేత రాకేష్‌ టికాయత్‌ నేతృత్వంలో ఉద్యమం సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు చక్కా జామ్‌ పేరుతో జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్భందించాలని నిర్ణయించారు.

ఈ రోజు శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు చక్కా జామ్‌ కార్యక్రమం జరగబోతోంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా రైతు సంఘాల నేతలు, రైతులు జాతీయ, రాష్ట్ర రహదారులపై నిరసన వ్యక్తం చేయనున్నారు. పాఠశాలలు, అంబులెన్స్‌లు ఇతర అత్యవసర వాహనాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. మూడు గంటల పాటు వాహనాలను ఎక్కడికక్కడ నిలిపి తమకు మద్ధతు తెలపాలని రైతు సంఘాలు వాహనదారులను కోరాయి. మధ్యాహ్నం మూడు గంటలకు కార్యక్రమం ముగిసేందుకు ఒక్క నిమిషం ముందు వాహనాల హారన్లు మోగించి తమ ఉద్యమానికి సంఘీభావం తెలపాలని రైతు సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

చక్కా జామ్‌ కార్యక్రమం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం.. అలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతోంది. ఆందోళనకారులు ఢిల్లీలోకి రాకుండా రహదారులపై బారికేడ్లు, కాంక్రీటు గోడలు, రోడ్లకు మేకులు కొట్టించింది. భారీ సంఖ్యలో పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్‌ బలగాలను మోహరించింది. చక్కా జామ్‌ కార్యక్రమంలో ఢిల్లీ నగరంలో జరగకపోయినా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెట్రో స్టేషన్లను మూసివేశారు. బందోబస్తును పటిష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వంలో పలుమార్లు చర్చలు జరిగినా.. ఎలాంటి ఫలితం లేకపోవడంతో.. ఇకపై చర్చలు జరిపేది లేదని, సాగు చట్టాల రద్ధు, కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రెండు డిమాండ్లతోపాటు స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, పంట రుణాలను రద్దు చేయాలనే నూతన డిమాండ్లను భారతీయ కిసాన్‌ యూనియన్‌నేత రాకేష్‌ టికాయత్‌ తెరపైకి తెచ్చారు. డిమాండ్ల సాధన కోసం వివిధ మార్గాల్లో నిరసన కార్యక్రమం కొనసాగించాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించినట్లు తాజాగా జరుగుతున్న పరిణామాల ద్వారా స్పష్టమవుతోంది. తమ డిమాండ్లు అమలు చేయకపోతే.. గద్దె దింపాల్సి వస్తుందని కూడా రాకేష్‌ టికాయత్‌ పరోక్షంగా హెచ్చరించడం విశేషం. ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని, త్వరలో 40 లక్షల ట్రాక్టర్లతో దేశ వ్యాప్తంగా ర్యాలీ నిర్వహిస్తామని కూడా రాకేష్‌ టికాయత్‌ హెచ్చరించారు. తాజా పరిణామాలను కేంద్ర ప్రభుత్వం సునిశితంగా పరిశీలిస్తోంది.