బతుకు పోరుబాట: ఆమరణనిరాహార దీక్షలో అన్నదాత

చీడపీడల నుంచి పంటలను రక్షించుకునేందుకు శక్తియుక్తులను ఒడ్డే రైతన్న నేడు తనకు బతుకుదెరువైన వ్యవసాయన్ని కబలించే చట్టాల నుంచి రక్షించుకునేందుకు నడుం బిగించారు. వ్యవసాయ నూతన చట్టాలను రద్దు చేయాలనే ఏకైక డిమాండ్‌తో 19 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో అన్నదాతలు చేస్తున్న ఆందోళన ఈ రోజు కొత్తరూపు దాల్చింది. ఇన్ని రోజుల నుంచి తాము ఆందోళన చేస్తున్నా.. చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయకపోవడంతో అన్నదాతలు నేడు అన్నం మానేశారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన రైతన్నల ఆమరణ నిరాహార దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

అన్నదాతలకు మద్ధతుగా దేశ వ్యాప్తంగా వివిధ రైతు సంఘాలు ఆమరణ దీక్షలో పాల్గొంటున్నాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలలో అన్నదాతలకు మద్ధతుగా ఎక్కడికక్కడ ఆమరణ నిరాహార దీక్షలు సాగుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ రైతుల ఆందోళనకు ఇప్పటికే మద్ధతు ప్రకటించాయి. రాజకీయ పార్టీలతో సహా అధికారులు, వివిధ రంగాలలోని ప్రముఖులు రైతుల ఆందోళనకు మద్ధతుగా నిలుస్తున్నారు. తాజాగా పంజాబ్‌ జైళ్ల శాఖ డీఐజీ లఖ్మిందర్‌ సింగ్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రైతులకు మద్ధతుగా తాను ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటున్నానని ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. తనతోపాటు ఆప్‌ కార్యకర్తలు కూడా రైతులకు మద్ధతుగా దీక్షలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఐదు సార్లు కేంద్ర మంత్రులు, రైతుల మధ్య చర్చలు జరిగినా ఫలితం తేలలేదు. చట్టాలు రద్దు చేయాలని రైతులు, సాధ్యం కాదు, సవరణలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం పట్టుబట్టాయి. రైతులను ఉగ్రవాదులను, రాజకీయ పార్టీలు నడిపిస్తున్నాయంటూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా.. అన్నదాతలు మాత్రం నిగ్రహం కోల్పోలేదు. సంయమనంతో వ్యవహరిస్తూ శాంతియుతంగా ఆందోళనను కొనసాగిస్తున్నారు. కుటుంబంతో సహా వచ్చి ఢిల్లీ సరిహద్దుల్లో ఎముకలు కొరిగే చలిలో పోరాటం సాగిస్తున్నారు. రైతుల పోరాటానికి దేశంతోపాటు ప్రపంచ దేశాల నుంచి మద్ధతు లభిస్తోంది. అయినా కేంద్రం తన వైఖరి మాత్రం మార్చుకోవడం లేదు.

Show comments