iDreamPost
android-app
ios-app

మలుపుతిరిగిన రైతు ఉద్యమం.. ఉద్రిక్తతల నడుమ ఢిల్లీలోకి ట్రాక్టర్‌ ర్యాలీ..

మలుపుతిరిగిన రైతు ఉద్యమం.. ఉద్రిక్తతల నడుమ ఢిల్లీలోకి ట్రాక్టర్‌ ర్యాలీ..

రెండు నెలలుగా ఎముకలు కొరికే చలిలోనే ఉంటూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా.. డిమాండ్లపై సానుకూలంగా స్పందించని కేంద్ర ప్రభుత్వ తీరుపై అన్నదాత కన్నెర్రజేశారు. ఇప్పటి వరకు ఢిల్లీ నగరం బయట శాంతియుతంగా నిరసన చేపట్టిన అన్నదాతలు.. తమ ఉద్యమం పంథాను మార్చారు. కేంద్ర ప్రభుత్వానికి తమ సత్తాను తెలియజేసేందుకు సిద్ధమయ్యారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌లో భాగంగా.. ఈ రోజు గణతంత్ర దినోత్సవం రోజున.. ట్రాక్టర్లతో కిసాన్‌ గణతంత్ర పరేడ్‌ను రైతులు చేపట్టారు. ఢిల్లీ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరగాల్సిన ట్రాక్టర్ల ర్యాలీ నాటకీయ పరిణామాలు, అనేక ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఢిల్లీ నగరంలోకి ప్రవేశించింది.

ముందుగానే ర్యాలీ ప్రారంభం..

గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ర్యాలీ జరగాల్సి ఉండగా.. అన్నదాతలు 12 గంటలకు ముందుగానే ర్యాలీని ప్రారంభించారు. సింఘా, టిక్రీ, ఘాజీపూర్‌ ప్రాంతాల నుంచి ట్రాక్టర్‌ ర్యాలీలు ప్రారంభం అయ్యాయి. నిర్ణీత సమయం కన్నా ముందుగానే ర్యాలీ ప్రారంభం కావడంపై పోలీసులు అభ్యంతరాలు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. కడుపుమండిన రైతన్న ట్రాక్టర్‌ ర్యాలీని సెంట్రల్‌ ఢిల్లీలో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ట్రాక్టర్లను ఢిల్లీ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి నగరంలోకి మళ్లించారు. ఈ క్రమంలో రైతులను అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. లాఠీ ఛార్జీ చేశారు. పలువురు అన్నదాతలకు గాయాలయ్యయి. అయినా అన్నదాతలు వెనక్కి తగ్గలేదు. వ్యవసాయ యంత్ర పరికరాలను కూడా ర్యాలీలోకి తీసుకువచ్చిన రైతులు.. వాటి ద్వారా పోలీసులు అడ్డుపెట్టిన బారీకేడ్డు, వాహనాలను అడ్డు తొలగించి ముందుకు వెళ్లారు.

ఎర్రకోటపై కిసాన్‌ జెండా..

సాగు చట్టాలను రద్దు చేయాలని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న అన్నదాత.. ఈ రోజు తన సత్తాను చాటారు. శాంతియుతంగానే కాదు.. అవసరమైతే దూకుడుగాను వ్యవహరిస్తామని తెలియజేశారు. ఢిల్లీని వణికించారు. చారిత్రక ఎర్రకోట వద్దకు ట్రాక్టర్లతో చేరుకున్నారు. ఎర్రకోటపైకి ఎక్కారు. ప్రధాని నరేంద్రమోదీ జాతీయ జెండా ఎగురవేసే పోల్‌పై కిసాన్‌ జెండాను ఎగురవేసి తమ సత్తాను చాటారు. ఎర్రకోట బురుజులపై ఎక్కి జై జవాన్‌.. జై కిసాన్‌ నినాదాలు చేస్తున్నారు. జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రాజ్‌పథ్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు..

రైతులు ట్రాక్టర్ల ర్యాలీని సెంట్రల్‌ ఢిల్లీలో నిర్వహించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. ఇండియా గేట్‌ వద్దకు చేరుకునేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. అక్కడకు సమీపంలోని రాజ్‌పథ్‌లో ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం రాజ్‌పథ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. అక్కడే తాము కూడా ట్రాక్టర్లతో నిరసన ర్యాలీ చేపట్టాలని రైతులు భావిస్తున్నారు.

ఇకపై ఢిల్లీలోనే ఉద్యమం..

రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో.. ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉద్యమం చేసిన రైతులు.. ఇకపై తమ నిరసనను ఢిల్లీలో కొనసాగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ట్రాక్టర్ల ర్యాలీతో ఢిల్లీలోకి ప్రవేశించిన రైతులు.. ఎక్కడికక్కడ భీష్మించుకూర్చున్నారు. వెనక్కి వెళ్లాలని పోలీసులు చేస్తున్న వినతులను ఏ మాత్రం ఖాతరు చేయని రైతన్న తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకూ వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. అన్నదాతల డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.