iDreamPost
android-app
ios-app

దివికేగిన ది గ్రేట్ డాన్స్ మాస్టర్

  • Published Jul 03, 2020 | 3:35 AM Updated Updated Jul 03, 2020 | 3:35 AM
దివికేగిన ది గ్రేట్ డాన్స్ మాస్టర్

బాలీవుడ్ సుప్రసిద్ధ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇవాళ కన్ను మూశారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఈవిడను గత నెల 20న ముంబైలోని గురు నానక్ హాస్పిటల్ లో చేర్పించారు. కార్డియాక్ అరెస్ట్ వల్ల అందరినీ శాశ్వతంగా వదిలి వెళ్లిపోయారు. సరోజ్ ఖాన్ 80, 90 దశకాల్లో తన డాన్స్ కంపోజింగ్ తో యువతరాన్ని ఒక ఊపు ఊపడమే కాక హిందీ సినిమాల్లో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. అప్పటిదాకా రాజేష్ ఖన్నా, దేవానంద్, రాజ్ కపూర్ లాంటి హీరోలు శరీరానికి ఎక్కువ కష్టం లేకుండా అలవాటు చేసిన సంస్కృతిని బ్రేక్ చేస్తూ సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టారు సరోజ్ ఖాన్. 

1983లో మొదటి సినిమా హీరోతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈవిడ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. మిస్టర్ ఇండియ, తేజాబ్, చాందిని, డర్, బాజీగర్, మోహ్రా, సోల్జర్, తాళ్ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలకు తిరుగులేని స్టెప్స్ సమకూర్చి వాటి విజయంలో చాలా కీలక పాత్ర పోషించారు. సరోజ్ ఖాన్ పేరు చూసి థియేటర్ కు వెళ్లే అభిమానులు తనకు ఉండేవాళ్ళంటే ఆవిడకు ఎంత క్రేజ్ ఉండేదో అర్థమవుతుంది. అందుకే 1998లో మెగాస్టార్ చిరంజీవి చూడాలని ఉంది కోసం ప్రత్యేకంగా పిలిపించి అందులో నృత్యరీతులు సరోజ్ ఖాన్ తో కంపోజ్ చేయించి ఎవర్ గ్రీన్ సాంగ్స్ కి మర్చిపోలేని జ్ఞాపకాలు తెచ్చుకున్నారు. సరోజ్ ఖాన్ లెక్కలేనన్ని అవార్డులు రివార్డులు సంపాదించుకున్నారు. మూడు సార్లు జాతీయ పురస్కారాలు దక్కించుకున్నారు.

ముఖ్యంగా మాధురి దీక్షిత్ కి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయారంటే దాని వెనుక సరోజ్ ఖాన్ పాటలు ఉన్నాయన్నది నగ్నసత్యం. ఇప్పటికీ వన్ టూ త్రి సాంగ్ ని బ్రేక్ చేసేది రాలేదని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. దేవదాస్, లగాన్, జబ్ వీ మెట్ లతో తన లేట్ ఏజ్ లోనూ సత్తా చాటిన సరోజ్ ఖాన్ ను ఆదర్శంగా తీసుకుని ఫరా ఖాన్ లాంటి ఎందరో టాలెంటెడ్ డాన్స్ మాస్టర్స్ ఇండస్ట్రీకి వచ్చారు. ఈవిడ భర్త పేరు సోహన్ లాల్. సంతానం ఇద్దరు కూతుళ్లు. హీనా ఖాన్, సుక్యానా ఖాన్. మగపిల్లలు లేరు. ఆఖరి చిత్రం గత ఏడాది వచ్చిన మల్టీ స్టారర్ కళంక్. వయసు మీద పడుతున్న లెక్క చేయకుండా చివరి దాకా తన జీవితాన్ని డాన్స్ కి అంకితం చేసి సినిమాలతోనే సహజీవనం చేసిన సరోజ్ ఖాన్ లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. సినీ ప్రముఖుల నుంచి ఆవిడకు నివాళులు వెల్లువెత్తుతున్నాయి.