iDreamPost
android-app
ios-app

బాబు రాజకీయానికి పరాకాష్ట..! శవరాజకీయం అంటే ఇదేనేమో..?

బాబు రాజకీయానికి పరాకాష్ట..! శవరాజకీయం అంటే ఇదేనేమో..?

నాలుగు దశాబ్ధాల రాజకీయ అనుభవం, దేశంలోనే సీనియర్‌ రాజకీయవేత్తను అని చెప్పుకునే ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు వినే వారికి హాస్యాస్పదంగా ఉంటున్నాయి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, దాదాపు 11 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పని చేసిన/చేస్తున్న రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలకు, చేసే విమర్శలకు, వ్యాఖ్యలకు ఎంతో విలువ ఉండాలి. ఆయన విమర్శలు, వ్యాఖ్యల్లో అంతో ఇంతో నిజాయతీ, అర్థం, తర్కం తప్పక ఉండాలి. అప్పుడే ఆయన మాటలకు, విమర్శలకు, ఆరోపణలకు, సూచనలకు ఎంతో కొంత విలువ, విశ్వసనీయత ఉంటుంది. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా చంద్రబాబు నుంచి అవి ఆశించడం వృథా అనేలా ఆయన తీరు ఉంటోంది.

తాజాగా చంద్రబాబు నాయుడు తనదైనశైలిలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ రోజు విశాఖకు చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా అనుచరుడుగా పిలవబడే నలంద కిశోర్‌ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఐదు రోజుల క్రితం జ్వరం కారణంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన నలంద కిషోర్‌ ఈ రోజు గుండెపోటుతో మృతి చెందారని కుటుంబ సభ్యులు చెబుతుండగా.. ఆయన కరోనా వైరస్‌ వల్ల ప్రాణాలు కోల్పోయారనే మాట వైద్య శాఖ నుంచి వస్తున్నాయి. ఆయన వైద్య పరీక్షల ఫలితాలు బయటపెడితేగానీ ఈ విషయంలో క్లారిటీ రాదు.

అయితే నలంద కిషోర్‌ మృతిపై చంద్రబాబు యథావిధిగా తన స్టయిల్ లో విమర్శ చేశారు. కిశోర్‌ మృతికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

ఇటీవల ఎంపీ విజయసాయి రెడ్డిపై సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టు పెట్టారని కిషోర్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయన్ను తీసుకెళ్లి విచారించి పంపారు. అరెస్ట్‌ కూడా చేయలేదు. కానీ చంద్రబాబు మాత్రం ప్రభుత్వం కేసు పెట్టి, విచారణ పేరుతో క్షోభకు గురిచేయడంతోనే మరణించారని చెప్పుకొస్తున్నారు. కేసులు బనాయించి, విచారణ పేరుతో విశాఖ నుంచి కర్నూలుకు తీసుకెళ్లి మానసికంగా, శారీరకంగా హింసిచారని, ఆ క్షోభ తట్టుకోలేకే నలంద కిషోర్‌ చనిపోయారని చంద్రబాబు విమర్శస్తున్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ కూడా చేస్తున్నారు.

ఇలాంటి అర్థరహితమైన విమర్శలు, డిమాండ్లు చంద్రబాబు ఎలా చేస్తారనేది రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుచిక్కడం లేదు. బాబు చెబుతున్నట్లు ఆయన్ను శారీరకంగా హింసించి ఉన్నట్లయితే చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా నానా యాగీ చేసేది. కానీ అలాంటిదేమీ కనిపించలేదు. పైగా విచారణ చేసి వదిలేశారు. అరెస్ట్‌ చేయలేదు. కనీసం జైలు ఎలా ఉంటుందో కూడా కిశోర్‌ చూడలేదు. మరి చంద్రబాబు చెప్పినట్లు ఆయన అంత క్షోభకు గురయ్యే పరిస్థితులు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియడంలేదు. పైగా నలంద కిషోర్‌పై కేసు, విచారణ గత నెల 23న జరిగింది. అంటే నెల రోజులకుపైగా సమయం గడిచిపోయింది. ఇన్ని రోజుల తర్వాత ఆయన క్షోభతో చనిపోయారని చంద్రబాబు అంటున్నారు. రాజకీయాల్లో తరచూ శవ రాజకీయాలు అనే పదం వినిపిస్తుంటుంది. ఆ పదం ఈ సందర్భానికి సరిపోతుందేమో.

ఇప్పుడే కాదు.. మాజీ స్పీకర్‌ కోడెల శివ ప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా బాబు ఇలాంటి విమర్శలే చేశారు. ప్రభుత్వం క్షోభ తట్టుకోలేక ఉరేసుకున్నాడని బాబు అన్నారు. నరసారావుపేట, సత్తనెపల్లిలో కోడెల కుమారుడు, కుమార్తె సాగించిన అక్రమ వసూళ్లపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. అదే విధంగా అసెంబ్లీ ఫర్నిచర్‌ వారి మోటార్‌సైకిల్‌ షోరూంకు తీసుకెళ్లడంపై కూడా కేసు పెట్టారు. ఈ కేసుల్లో కోడెలను గానీ, ఆయన కుమారుడు, కుమార్తెను గానీ పోలీసులు అరెస్ట్‌ చేయలేదు. కనీసం విచారణకు కూడా పిలవలేదు. కూతురు, కుమారుడు చేసిన పనుల వల్ల అవమానానికి గురైన కోడెలకు ఓదార్పు కరువైంది.

ప్రస్తుతం అచ్చెం నాయుడు, జేసీ ప్రభాకర్‌ రెడ్డి, కొల్లు రవీంద్రలపై నమోదైన కేసులపై స్పందిస్తున్న చంద్రబాబు నాడు కోడెలపై నమోదైన కేసులపై మాత్రం మిన్నుకుండిపోయారు. పార్టీ అండగా ఉండడంలేదనే భావనలోకి వెళ్లిన కోడెల.. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో ఉంటే చంద్రబాబు కనీసం ఫోన్‌ చేసి అయినా పరామర్శించలేదు. పైగా ఎన్నికల తర్వాత సత్తెనపల్లిలో కోడెల వ్యతిరేకవర్గానికి కొమ్ముకాసి విమర్శలు చేయించారు. కోడెలకు ఇంచార్జి పదవి నుంచి తప్పించాలంటూ పార్టీ నేతలే ఆందోళనలు, నిరసనలు చేసినా.. చంద్రబాబు వారించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కోడెల ప్రాణాలు తీసుకున్న వెంటనే.. ఆయన మృతికి ప్రభుత్వమే కారణమంటూ ఇప్పుడు చేసినట్లు అప్పడూ విమర్శలు చేశారు.