Idream media
Idream media
తెంగాణ లోని మద్యం వ్యాపారులు తమ అదృష్ఠాన్ని పరీక్షించుకునే క్రమంలో ప్రభుత్వ ఖజానాను కాసులతో నింపేశారు.రూ.2 లక్షల టెండర్ ఫీజు.. లాటరీలో అదృష్టం వరించకపోతే ఆ రూ.2 లక్షలు పోయినట్టే. పోతే రూ.2లక్షలు.. వస్తే మద్యం దుకాణం అనే ధోరణిలో దరఖాస్తులు భారీగా సమర్పించారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలకు గాను టెండర్ల స్వీకరణ గడువు ముగిసిన బుధవారం నాటి రాత్రికి ఎక్సైజ్ అధికారుల లెక్కల ప్రకారం 44 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం ఒక్కరోజే 20 వేలకు పైగా దరఖాస్తులు సమర్పించారు. ఎక్సైజ్ డీసీ కార్యాలయాలు కిక్కిరిసిపోవడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి మరీ దరఖాస్తులు స్వీక రించాల్సి వచ్చింది. దీంతో అర్ధరాత్రి వరకు ఎక్సైజ్ అధికారులు ఈ టెండర్ల స్వీకరణ, పరిశీలనలో బిజీ అయిపోయారు. కేవలం దరఖాస్తుల ద్వారానే సర్కారుకు ఏకంగా రూ.880 కోట్లకు పైగా ఆదాయం కేవలం టెండర్ ఫీజు రూపంలోనే వచ్చింది. 2017లో 2,216 దుకాణాలకు టెండర్లు పిలవగా 41 వేలకు పైగా దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.410 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు కూడా షాపుల సంఖ్య పెరగక పోయినా దరఖాస్తులు ఎక్కువగా రావడంతో గతేడాది కన్నా రూ.470 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరనుంది.