ఏపీలో వాయిదా లేదు, యధావిధిగా పరీక్షలు

కరోనా తాకిడి పెరుగుతున్న తరుణంలో కేంద్రం సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా వేసింది. సీబీఎస్ బోర్డు ఈ మేరకు ప్రకటన చేస్తూ పదో తరగతి పరీక్షలు పూర్తిగా రద్దు చేసి, 12వ తరగతి పరీక్షలు మాత్రం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అదే సమయంలో ఏపీలో మాత్రం ఎస్సెస్సీ పరీక్షలు యధావిధిగా జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఎటువంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా కకావికలం సృష్టిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. తాజాగా కుంభమేళా కారణంగా ఉత్తరప్రదేశ్ లోనూ కరోనా తాకిడి ఉధృతమవుతోంది. ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాద్ దాస్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్రం పదో తరగతి పరీక్షల రద్దు నిర్ణయాన్ని తీసుకుంది.

ఏపీలో మాత్రం కరోనా నియంత్రణ సాగుతోందని ప్రభుత్వం చెబుతోంది. వ్యాక్సినేషన్ కోసం సచివాలయాల్లో చేసిన ఏర్పాట్లు కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని చెబుతోంది. అవసరమయితే మరిన్ని వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేసి అందరికీ టీకా అందించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్రం నుంచి టీకా సరఫరాలో జాప్యం కొంత సమస్య అవుతోంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సమన్యయం చేస్తూ ముందుకు సాగుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ అంటోంది.

ఇలాంటి సమయంలో పరీక్షల వాయిదా అవసరం లేదని విద్యాశాఖ మంత్రి తెలిపారు. గత ఏడాది కూడా ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసి అందరినీ ఉత్తీర్ణులు చేశారు. ఈసారి మళ్లీ అలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందేమోననే ఆందోళన విద్యార్థుల్లో మొదలయ్యింది. దానికి మంత్రి పూర్తిస్థాయిలో స్పష్టతనిచ్చారు. ప్రభుత్వానికి పరీక్షలు వాయిదా వేసే ఆలోచన లేదని తేల్చేశారు. షెడ్యూల్ ప్రకారం పరీక్షలకు ఇంకా సమయం ఉన్నందున అప్పటి వరకూ వాయిదా గురించి ఆలోచన రాదని ప్రభుత్వం చెప్పడంతో విద్యార్థులకు ఊరటగా మారింది.

Also Read : మహారాష్ట్రలో ఏ క్షణానికి ఏమి జరుగునో..?

Show comments