బెంగాల్.. దంగల్.. తృణముల్ గూటికి బిజెపి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా

దేశంలో ఇప్పుడు అందరి చూపు పశ్చిమబెంగాల్ ఎన్నికల పై పడింది. ఇక్కడ రాజకీయాలు రోజుకోరకంగా మలుపు తిరగడం దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకుంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరడం తో ఇక్కడ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.

బిజెపిపై విమర్శల వర్షం

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, భాజపా మాజీ నేత యశ్వంత్‌ సిన్హా తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. శనివారం ఉదయం కోల్‌కతాలోని టీఎంసీ భవన్‌లో ఆ పార్టీ నేతల సమక్షంలో తృణమూల్‌ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గతంలో ఎన్నడూ లేని వింత పరిస్థితిని దేశం ఇప్పుడు ఎదుర్కొంటోంది. వ్యవస్థల బలంపైనే ప్రజాస్వామ్య శక్తిసామర్థ్యాలు ఆధారపడి ఉంటాయి. కానీ నేడు దేశంలో న్యాయవ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలు బలహీనపడుతున్నాయి. వాజ్‌పేయీ హయంలోని భాజపా ప్రభుత్వం ఏకాభిప్రాయ విధానాలను విశ్వసించేది. కానీ నేటి ప్రభుత్వం ‘అణచివేత-విజేత’ ధోరణిని నమ్ముతోంది. అందుకే అకాళీదళ్, బిజు జనతాదళ్‌ వంటి పార్టీలు ఎన్డీయేను వీడాయి’’ అంటూ భాజపాపై విమర్శలు గుప్పించారు.

ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా..

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న యశ్వంత్ సిన్హా 2018 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయినప్పటికీ ఆయన బిజెపి అనుసరిస్తున్న వైఖరిపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. గతంలో బీహార్ ఎన్నికల సమయంలో ఆయన బిహార్ లో సొంత పార్టీ పెడతారన్న ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగానే యశ్వంత్ సిన్హా కూడా బీహార్లో నితీష్, దేశంలో మోడీ ఆటలను కట్టించేందుకు తాను మళ్ళీ వస్తానని ప్రకటన కూడా చేశారు. దీంతో బీహార్ ఎన్నికల్లో ఆయన సొంత పార్టీ పెడతారని అందరూ భావించారు. కానీ పార్టీ పెట్టలేదు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ లో చేరడంతో బీజేపీపై తనకున్న వైఖరిని ఆయన చెప్పకనే చెప్పారు.

యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరడం లో అనేక కారణాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ పశ్చిమ బెంగాల్ ఎన్నికలే దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు పలు రాష్ట్రాల్లో తన హవా చాటుకుంటున్న వస్తున్న బిజెపి అదే పంథాలో పశ్చిమబెంగాల్లో కూడా తమ పార్టీ జెండా ఎగురవేయాలని భావిస్తుంది. దానికనుగుణంగానే నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ రాష్ట్ర ఎన్నికల పై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడ కీలక ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీలను, రాజవంశాలను ఆకట్టుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ ప్రయత్నాలకు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ధీటుగా సమాధానం ఇస్తున్నారు.

బెడిసికొట్టిన పారిశ్రామిక విధానం..

దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఇక్కడ పాలన సాగించిన కమ్యూనిస్టుల కోటను కూల్చి మమత అధికారం చేపట్టింది. అప్పటివరకు పాలన సాగించిన కమ్యూనిస్టులు పారిశ్రామిక విధానాన్ని అంతగా పట్టించుకోకపోవడం అప్పట్లో మమతా కు కలిసొచ్చింది. దీంతో ఆమె పశ్చిమబెంగాల్లో ఖాళీ ప్రదేశాల్లో పారిశ్రామిక వాడలను నిర్మించి చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అయితే ఏప్రిల్లో బెంగాల్ లో జరగనున్న ఎన్నికల్లో బిజెపి కూడా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకొచ్చింది. కానీ నీ ఇక్కడ పరిశ్రమలు నిర్మించడానికి సరిపడా స్థలాలు లేవనే విషయాన్ని విస్మరించింది. దీన్నే మమత ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ విషయం మమతా కి కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.

విమర్శలతో వార్తల్లో నిలిచిన యశ్వంత్

83ఏళ్ల యశ్వంత్ సిన్హా గతంలో సుదీర్ఘకాలం జనతాదళ్‌, భాజపాలో పనిచేశారు. భాజపా హయాంలో అటల్ బీహార్ వాజ్ పై ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రిగానూ వ్యవహరించారు. అయితే సొంతపార్టీపైనే బహిరంగ విమర్శలు చేసి వార్తల్లో నిలిచిన సిన్హా.. 2018లో భాజపాను వీడారు. ఆ తర్వాత కూడా ఎన్డీయే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్న ఆయన.. బెంగాల్‌ ఎన్నికల సమయంలో తృణమూల్‌ పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొద్ది నెలలుగా బెంగాల్‌లో అనేక మంది తృణమూల్‌ నేతలు కాషాయ కండువా కప్పుకుంటున్న తరుణం లో టీఎంసీలోకి సిన్హా రాక ఆ పార్టీకి కలిసొచ్చే పరిణామమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : దీదీ.. మోదీ నోట.. మతువాల పాట

తండ్రి వర్సెస్ తనయుడు?

యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా బిజెపిలో కొనసాగుతున్నారు. 1990 నుంచి రాజకీయాల్లో ఉన్న ఆయన 1998 బీహార్లోని హజారీబాగ్ పార్లమెంటు నియోజకవర్గంలో తన తండ్రి యశ్వంత్ సిన్హా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జయంత్ సిన్హా 1,59,128 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ ఆయన అదే నియోజకవర్గం నుంచి 4,79,548 ఓట్ల మెజారిటీ తో భారీ విజయం సాధించారు. అయితే 2018 నుంచి యశ్వంత్ సిన్హా బిజెపిని వీడినప్పటికీ. జయంత్ సిన్హా మాత్రం బీజేపీ పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తండ్రికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఆయనను ఎన్నికల ప్రచారానికి బిజెపి దింపే అవకాశం లేకపోలేదు. దీంతో ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో వైసీపీకి అనుకూలంగా మాట్లాడడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పలువురు బీజేపీ నేతలు తృణముల్ గూటికి చేరటం అక్కడ రాజకీయంగా కాక రేపుతుంది.

Show comments