Idream media
Idream media
మాజీ మంత్రి, టీడీపీ నేత కొత్తపల్లి శ్యామ్యూల్ జవహర్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇటీవల తనను కలసిన వారు, తాను కలసిన వారు పరీక్షలు చేయించుకోవాలని మాజీ మంత్రి సూచించారు.
కరోనా సెకెండ్ వేవ్‌లో జవహర్ దాని బారినపడ్డారు. టీడీపీ వాయిస్‌ను బలంగా వినిపిస్తున్న జవహర్ ఇటీవల తరచూ పత్రికా సమావేశాలు నిర్వహించారు. నేతలతోనూ భేటీ అయ్యారు. ఉభయ గోదావరి జిల్లాల్లో బడా నేతలు ఉన్నా.. వారందరూ సైలెంట్ అవడమో లేదా నియోజకవర్గానికి పరిమితం అయ్యారు. జవహర్ ఒక్కరే ఆ జిల్లాల నుంచి టీడీపీ వాయిస్‌ను రాష్ట్ర స్థాయిలో వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కరోనా బారిన పడడంతో మరికొద్ది రోజులు ఉభయ గోదావరి జిల్లాల నుంచి టీడీపీ వాయిస్‌కు చిన్నపాటి బ్రేక్ వచ్చినట్లైంది.
ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా ఉన్న జవహర్‌కు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని పలు పాఠశాలల్లో టీచర్‌గా పని చేశారు. ఆ తర్వాత మండల అక్షరాశ్యతా అధికారి (ఎంఎల్‌వో)గా బాధ్యతలు నిర్వర్తించారు. ఉపాధ్యాయ సంఘమైన యూటీఎఫ్‌లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014 ఎన్నికలకు ముందు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. అది నెరవేరలేదు.
2014లో జవహర్‌కు అదృష్టం వరించింది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీవీ రామారావుపై లైంగిక ఆరోపణలు, కేసులు నమోదు కావడంతో.. టీడీపీ అధినేత కొత్త అభ్యర్థి వేటలో పడ్డారు. వారికి జవహర్ సరైన అభ్యర్థిగా కనిపించారు. 2014 ఎన్నికల్లో జవహర్ గెలుపొందారు. ఎమ్మెల్యేగా పని చేసిన రెండేళ్లకు అనూహ్యంగా మంత్రి పదవి కూడా దక్కింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేశారు.
2019 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసిన జవహర్.. ఈ సారి నియోజకవర్గం మారారు. కృష్ణా జిల్లా తిరువూరు నుంచి బరిలోకి దిగారు. వైసీపీ అభ్యర్థి రక్షణనిధిపై ఓడిపోయారు.
ఓటమి తర్వాత చాలా మంది టీడీపీ నేతలు సైలెంట్ అయినా.. జవహర్ మాత్రం టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అధికార వైసీపీతోపాటు, బీజేపీపై కూడా విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. న్యూస్ ఛానెళ్ల చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటూ టీడీపీ వాయిస్‌ను వినిపిస్తున్నారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకునే వరకూ ఆయన ఇంటికే పరిమితం కాబోతున్నారు.
Also Read : తిరుపతి ఉప ఎన్నిక : టీడీపీ, బీజేపీ ఆ మాటెత్తడం లేదేమి..?