25న గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలం

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి అంతా సిద్ధమయ్యింది. ఈనెల 25న దానికి ముహూర్తంగా నిర్ణయించారు. ఈవిషయాన్ని ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ప్రత్యూషా కంపెనీ పేరుతో తీసుకున్న అప్పులు చెల్లించకపోవడంతో ఈ చర్యకు పూనుకుంటున్నారు. ఇప్పటికే వాటికి సంబంధిచిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. 2016లోనే ఇండియన్ బ్యాంక్ అధికారులు దానికి అనుగుణంగా ప్రకటనలు చేశారు.

గంటా శ్రీనివాసరావుకి చెందిన ప్రత్యుషా రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రై. లిమిటెడ్ పేరుతో ఇండియన్ బ్యాంకు నుంచి రూ. 141.68 కోట్లు అప్పుగా తీసుకున్నారు. కానీ దానిని తిరిగి చెల్లించడంలో నిర్లక్ష్యం చేశారు. దాంతో అది వడ్డీతో కలిపి రూ. 220.66 కోట్లకు చేరడంతో ఆస్తుల స్వాధీనానికి సిద్ధమయ్యారు. ఆ క్రమంలో ప్రత్యుషా కంపెనీ పేరుతో ఉన్న ఆస్తులపై గ్యారంటీర్లుగా ఉన్న వారి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటున్నట్టు 2016లో ప్రకటించారు.

సకాలంలో అప్పు చెల్లించని కారణంగా ఆస్తుల స్వాధీనం వరకూ వచ్చిన ఈ వ్యవహారంలో ప్రత్యూష కంపెనీలో ప్రస్తుతం తాను డైరెక్టర్ గా కూడా లేనని గంటా ప్రకటించారు. అయినప్పటికీ బాలయ్య శాస్త్రి లే అవుట్ లో ఉన్న ఫ్లాట్ తో సహా గంటాకి చెందిన పలు ఆస్తుల స్వాధీన ప్రక్రియ మాత్రం బ్యాంక్ చేపట్టింది. గతంలో ఇచ్చిన నోటీసుల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 5న ఈ వేలం వేస్తామని ప్రకటించారు. అయితే అది వాయిదా పడడంతో ప్రస్తుతం బహిరంగవేలం నిర్వహించేందుకు బ్యాంకు పూనుకుంది.

ప్రత్యుష కంపెనీకి చెందిన పి రాజారావు, పివీ భాస్కర్ రావు , గంటా శ్రీనివాసరావు , కేబీ సుబ్రహ్మణ్యం అనే వారి పేర్లతో ఉన్న ఆస్తులను చట్టం ప్రకారం స్వాధీనం చేసుకంటున్నట్టు ఇప్పటికే బ్యాంక్ స్పష్టం చేసింది. 2016 డిసెంబర్ 27, 2017 ఫిబ్రవరి 21 న ఇచ్చిన స్వాధీన నోటీసులకు స్పందించకపోవడంతో నవంబర్ 17, 2019లో వారి ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. విశాఖనగరం, రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆస్తులతో పాటుగా తమిళనాడులోని కంచీపురం, తూర్పు గోదావరి జిల్లాలోని మరికొన్ని ఆస్తులు వేలం వేయబోతున్నారు

ప్రస్తుతం బ్యాంకుకి చెల్లించాల్సిన వడ్డీతో కలిపి మొత్తం బకాయి రూ. 280.03 కోట్లకు చేరింది. దాంతో బకాయి వసూలు నిమిత్తం వేలం ప్రక్రియకు సిద్ధం కావడంతో గంటా శ్రీనివాసరావు వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం రాజకీయంగా స్తబ్ధతగా ఉన్న గంటాకి ఈఆస్తుల వేలం విషయం పరువు తీసేలా ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.

Show comments