Idream media
Idream media
రాజకీయ నాయకులు ఏదైనా ఒక అంశంపై మాట్లాడే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎంతో అవసరం. మరీ ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకునే సమయంలో సదరు అంశంపై అధ్యయనం చేసి మీడియా ముందుకు రావాలి. లేదంటే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే ప్రజల్లో నవ్వులపాలు కావాల్సి వస్తుంది. పైగా తాము మాట్లాడేది నిజం కాదని వారి అవగాహనలేమి మాటల ద్వారా ఒప్పుకున్నట్లు అవుతుంది.
ప్రస్తుతం ఏపీలో అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ భూ కుంభకోణంపై రాజకీయం నడుస్తోంది. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ, వైజాగ్‌లో వైసీపీ ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేస్తోందని టీడీపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే అక్కడ భూములు కొన్నారనే అభియోగాలపై సిట్, ఏసీబీ చేస్తున్న దర్యాప్తులపై టీడీపీ నేతల పిటిషన్ల మేరకు హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ కుంభకోణంలో రాజకీయ నేతలతోపాటు న్యాయశాఖలోని ప్రముఖులు కూడా ఉండడంతోనే విచారణను ప్రాథమిక దశలోనే అడ్డుకుంటున్నారని అభిప్రాయాలు అందరిలోనూ బలపడ్డాయి. ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలు కూడా బయటకు చెప్పరాదని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై దేశంలోని న్యాయ కోవిదులు, మీడియా ప్రముఖులు ఆశ్చర్యం, అనుమానాలు వ్యక్తం చేశారు.
అయితే ఎదురుదాడి చేయడం వల్ల అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ ప్రమాదం నుంచి గట్టెక్కాలని టీడీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే అనుకూల మీడియా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను పక్కదోవ పట్టించేలా హైదరాబాద్‌లో జరిగిందని, విశాఖలో జరుగుతోందని కథనాలు వండివార్చుతున్నాయి. మరో వైపు టీడీపీ నేతలు కూడా విశాఖలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, దీనిపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ తికమకపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖ టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయన్నపాత్రుడు.. పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత విశాఖలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరుగుతోందని ఆరోపించారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటున్న వారు ఇప్పుడు విశాఖలో జరుగుతున్నదాన్ని ఏమంటారని ప్రశ్నించారు. విశాఖలో జరుగుతున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
అసలు అమరావతిలో జరిగింది ఏమిటి..? అయ్యన్న పాత్రుడు విశాఖలో జరగుతోందని చెబుతున్నది ఏమిటి..? అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే ఆ గ్రామాల్లో టీడీపీ నేతలు, చంద్రబాబు అనునూయలు భూములు కొన్నారని, ఇది చట్టవిరుద్ధమని వైసీపీ 2015లోనే వెలుగులోకి తెచ్చింది. దీన్ని ఇన్‌సైడర్‌ట్రేడింగ్ అంటారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన తర్వాత భూములు కొంటున్నారని, అది ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ అయ్యన్న పాత్రుడు.. అమరావతికి, విశాఖకు పోలిక పెట్టి సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ దొరికిపోతున్నారు.
అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై జరిగే దర్యాప్తును అడ్డుకోవడం ద్వారానే అక్కడ నేరం జరిగిందనే అనుమానం అందరిలోనూ బలపడింది. ఏదైనా ఒక ప్రాంతంలో ప్రాజెక్టును ప్రకటించక ముందే అక్కడ భూములు కొనడానికి, ప్రకటించిన తర్వాత కొనడానికి తేడా ఉందా..? లేదా.? అనేది సీనియర్ నేత, మంత్రిగా పని చేసిన అయ్యన్న పాత్రుడుకు తెలియదనుకోవాలా..? అవగాహన ఉన్నా.. ప్రజలను పక్కదోవ పట్టించేందుకే ఇలా మాట్లాడుతున్నారని అనుకోవాలా..?