Idream media
Idream media
కుముద్‌బెన్ జోషి చనిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి 1985-90 మధ్య గవర్నర్‌గా చేశారు. తెలుగు పత్రికలు కూడా చిన్నవార్త తప్ప, ఎక్కువ రాయలేదు. చాలా గట్టి మహిళ. కాంగ్రెస్ ఏజెంటని అప్పటి సీఎం NT రామారావు విమర్శించినా లెక్క చేసేది కాదు. ఆమెని దగ్గరగా చూసే అవకాశం ఒకసారి వచ్చింది.
1986లో వరదలు. SK యూనివర్సిటీ NSS విద్యార్థిగా భద్రాచలం సమీపంలోని చింతూరుకి వెళ్లాను. మొత్తం వంద మంది. హైస్కూల్‌లో బస. బురదతో నిండిపోయిన ఇళ్లను శుభ్రపరచడం పని. అప్పట్లో చింతూరు నక్సల్ ప్రభావిత ప్రాంతం. పోలీస్ క్యాంప్ వుండేది. బూట్ల చప్పుడుతోనే నిద్రలేచే వాళ్లం. పేదరికం, కరువు అనంతపురానికి కొత్త కాదు కానీ, మరీ గోచీ తప్ప ఏమీ లేని నిరుపేద గిరిజనుల్ని చూడడం అదే మొదలు. చింతూరు సంతలో అన్ని డూప్లికేట్ వస్తువులు అమ్మి గిరిజనుల్ని మోసం చేసేవాళ్లు.
ప్రజల్ని పరామర్శించడానికి గవర్నర్ కుముద్‌బెన్ జోషి చింతూరు వచ్చారు. గెస్ట్‌హౌస్‌లు లేని వూరు కదా, రెవెన్యూ ఆఫీస్ దగ్గర స్వాగతం పలికారు. విద్యార్థులు మేము కూడా వున్నాం. టీ, బిస్కెట్ ఇలా ప్రొటోకాల్ మర్యాదలు చేయబోతే ఆవిడ చిరాకు పడ్డారు. నేనొచ్చింది ఇవి తినడానికి కాదు ప్రజలతో మాట్లాడ్డానికి అని ఇంగ్లీష్‌లో మందలించారు. విద్యార్థులుగా మా సేవని ప్రశంసించారు.
పేద గిరిజనులతో ఫొటోల కోసం కాకుండా చాలా ప్రేమగా మాట్లాడారు. ప్రభుత్వంతో మాట్లాడి సాయం అందిస్తానని చెప్పారు. అక్కడికి దగ్గరలోని కూనవరం బాగా నష్టపోయిందని తెలిసి వెళదామన్నారు. శబరినదిలో లాంచీలో వెళ్లాలి. సెక్యూరిటీ రీత్యా భద్రత కాదని అధికారులు అభ్యంతరం చెబితే వినలేదు.
భయపడేదాన్ని అయితే రాజ్‌భవన్‌లో కూచునేదాన్ని, పద వెళదామన్నారు. అధికారులు అప్పటికప్పుడు కూనవరం పర్యటన ఏర్పాటు చేశారు. మామూలుగా గవర్నర్లు పెద్దగా ప్రజలతో కలవరు. కానీ కుముద్‌బెన్‌జోషి ఉత్సాహమే వేరు. ఎప్పుడూ వార్తల్లో వుండేవారు. తెలుగుదేశం విమర్శల్ని లెక్కచేసే వారు కాదు.
నేను అతి సమీపం నుంచి చూసిన మహిళా నాయకుల్లో ఈమె గుర్తుండిపోయారు. 36 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన ఇంకా కళ్లలోనే వుంది.
– GR Maharshi