iDreamPost
iDreamPost
మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్సుకు ఊహించని దెబ్బ తగిలింది. రాహుల్ గాంధీ సన్నిహితుడైన కేంద్ర మాజీమంత్రి జితిన్ ప్రసాద పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. అసలే యూపీలో అంతంతమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఈ పరిణామంతో మరింత దిగజారిపోతుందని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
తమ పార్టీలోకి ఒక ప్రముఖ వ్యక్తి రాబోతున్నారని బీజేపీ ఎంపీ అనిల్ బలూని ట్విటర్ ద్వారా పేర్కొన్న మరుసటి రోజే జితిన్ ప్రసాద బీజేపీలో చేరడం విశేషం. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు గోయల్, జితిన్ ప్రసాద కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి చర్చలు జరిపారు.
మధ్య యూపీలో మంచి పట్టు
జితిన్ ప్రసాదకు సెంట్రల్ యూపీలోని బ్రాహ్మణ వర్గంలో మంచి పట్టు ఉంది. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ, పి.వి.నరసింహారావులకు రాజకీయ సలహాదారుగా పనిచేసిన కాంగ్రెస్ పాత తరం నేత, దివంగత జితేంద్ర ప్రసాద తనయుడే జితిన్.
సోనియా గాంధీ ఏఐసీసీ అధ్యక్షపదవికి పోటీచేసినప్పుడు ఆవిడ మీద జితేంద్రప్రసాద పోటీచేసి ,ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాన్ని ఇవ్వలేదు. అయినా కానీ సోనియా ప్రసాదా తండ్రి కొడుకులకు సుముచిత స్థానం ఇచ్చింది.
2004లో షాజహాన్పూర్ నుంచి, 2009లో దౌరాహ్రీ నుంచి లోకసభకు ఎన్నికైన ఆయన యూపీఏ-1, 2 ప్రభుత్వాల్లో సహాయ మంత్రిగా పలు శాఖలు నిర్వహించారు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అగ్ర నాయకత్వంలో పూర్తి సంస్కరణలు రావాలని గళమెత్తిన 23 మంది సీనియర్ నేతల్లో జితిన్ ప్రసాద కూడా ఉన్నారు.
వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెసును వీడినప్పుడే జితిన్ కూడా పార్టీ మారతారని ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో ప్రియాంక గాంధీ జోక్యం చేసుకొని నచ్చజెప్పడంతో వెనక్కితగ్గారు. కాంగ్రెస్ తో తమ కుటుంబానికి మూడు తరాల బంధం ఉందని జితిన్ చెప్పారు. పార్టీ మారే విషయంలో చాలా ఆలోచించానన్నారు. గత పదేళ్లుగా దేశాన్ని నడిపిస్తున్న.. నడిపించగల పార్టీ బీజేపీయేనని అర్థమైందని ఆయన అన్నారు. అందుకే ఆ పార్టీలో చేరినట్లు చెప్పారు.
బీజేపీకి బూస్ట్
వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కోవిడ్ నియంత్రణలో వైఫల్యం, శాంతి భద్రతల సమస్యలు, స్థానిక ఎన్నికల్లో పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీజేపీకి జితిన్ ప్రసాద చేరిక కొత్త ఊపునిస్తుంది. ఇప్పటికే ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమైన బీజేపీ.. అందులో భాగంగానే వలసలకు తెరతీసినట్లు కనిపిస్తోంది.
జితిన్ చేరికతో మొదలైన వలసలు ముందు ముందు జోరందుకుంటాయని అంటున్నారు. కాగా యూపీ కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది. 403 మంది సభ్యులున్న యూపీ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం ఏడు మాత్రమే. గత ఐదేళ్లలో ఏమాత్రం మెరుగుపడని ఆ పార్టీ పరిస్థితి జితిన్ ప్రసాద నిష్క్రమణతో మరింత దిగజారినట్లే.
Also Read : దీదీకి బ్రేకులు వేయటం ఎలా?సువెందు అధికారి సమాలోచన