వరుసగా రెండో ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫిని గెలిచిన టీమ్ ఇండియాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఆస్ట్రేలియా సొంతగడ్డపై 2-1 తేడాతో నాలుగు టెస్టుల సిరీస్ ని కైవసం చేసుకున్న భారత జట్టు పోరాటపటిమని ప్రశంసించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. టీం ఇండియా చేసిన పోరాటం అలాంటి ఇలాంటి పోరాటం కాదు. చరిత్రలో నిలిచిపోయే పోరాటం. అందుకు కారణాలు లేకపోలేదు. ఆ కారణాలేంటో ఓ సారి చూద్దాం..
భారత క్రికెట్ జట్టు సెలెక్టర్లు ఏరికోరి ఎంపిక చేసిన జట్టు మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో చేసిన మొత్తం పరుగులు 36. పెవిలియన్ ఎప్పుడెప్పుడు చేరుదామా అన్నట్లు బ్యాటింగ్ చేసిన భారత ఆటగాళ్లు టెస్టుల్లో తమ అత్యల్ప స్కోర్ అయిన 42 పరుగులని బ్రేక్ చేసి 36 పరుగులతో కొత్త రికార్డు నమోదు చేశారు. దీంతో భారత క్రికెట్ జట్టుపై విమర్శల వర్షం మొదలయింది. దానికి తోడు రెండో టెస్టు నుండి భారత ప్రధాన ఆటగాడు టీం ఇండియా కెప్టెన్ వ్యక్తిగత కారణాలతో సిరీస్ నుండి తప్పుకున్నాడు. దాంతో ఆస్ట్రేలియాతో పోరుకు రహానే సారధ్యంలో రెండో టెస్టుకు భారత జట్టు సిద్ధమైంది. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో కసితో ఆడిన టీం ఇండియా ఆ టెస్టులో విజయం సాధించి సిరీస్ ని సమం చేసి విమర్శల బారి నుండి బయటపడింది.
మూడో టెస్టు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. చతేశ్వర పుజారా,అశ్విన్,హనుమ విహారిలు చేసిన పోరాటం క్రికెట్ ఉన్నంతకాలం చరిత్రలో నిలిచిపోతుంది. ముఖ్యంగా తీవ్ర గాయంతో ఉండి కూడా హనుమ విహారి అశ్విన్ తో కలిసి భీకరమైన ఆసీస్ బౌలర్లను ఎదుర్కొంటూ మ్యాచ్ ని డ్రా చేయడం భారత జట్టులో ఉన్న స్ఫూర్తిని తెలియజేస్తుంది. స్లెడ్జింగ్ చేసి భారత ఆటగాళ్లను ఇబ్బంది పెట్టినా జాత్యహంకార వ్యాఖ్యలు చేసినా సరే ఆటతో సమాధానం చెప్పిన టీం ఇండియా మూడో టెస్టును డ్రాగా ముగించి తమ పోరాట పటిమని చాటుకుంది. ఈ టెస్టులో రిషబ్ పంత్ చేసిన పోరాటం కూడా చరిత్రలో నిలిచిపోతుంది. తృటిలో సెంచరీ కోల్పోయినా ఎదురుదాడికి దిగి ఒకానొక దశలో విజయంపై ఆశలు రేకెత్తించాడు. రిషబ్ పంత్ ఔట్ అయిన తర్వాత భారత జట్టు డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
నాలుగో టెస్టు పరిస్థితి పూర్తిగా భిన్నం.. భారత జట్టులో ప్రధాన ఆటగాళ్లుగా పేరుపొందిన వాళ్లలో ఎక్కువమంది గాయాలబారిన పడ్డారు. ప్రధాన బౌలర్ అయిన బుమ్రాతో పాటు జట్టుకు వెన్నెముక లాంటి స్పిన్నర్లయిన అశ్విన్,రవీంద్ర జడేజా గాయాల కారణంగా నాలుగో టెస్టుకు దూరం అయ్యారు. దాంతో ఊహించని విధంగా వాషింగ్టన్ సుందర్,శార్దూల్ ఠాకూర్ లను తుది జట్టులోకి తీసుకున్నారు. వీరిద్దరికీ ఇది తొలి టెస్టు కావడం గమనార్హం. దాంతో నాలుగో టెస్టులో భారత విజయంపై ఎవరికీ అంచనాలు లేవు. కానీ భారత్ గెలుపు కోసం పోరాడింది. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 186 పరుగులకే సగం జట్టు పెవిలియన్ చేరిన అనంతరం వాషింగ్టన్ సుందర్,శార్దూల్ ఠాకూర్ లు చేసిన పోరాటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
గబ్బా పిచ్ పై అత్యంత భీకరంగా దూసుకొస్తున్న బంతులని కాచుకుని వీరిద్దరూ అస్ట్రేలియా ఆధిక్యాన్ని తగ్గిస్తూ చేయాల్సిన నష్టం చేసేసారు. తొలి టెస్టు ఆడుతున్న భయం లేకుండా గొప్పగా పోరాడారు. దాని ఫలితంగా 33 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది ఆస్ట్రేలియాకు. రెండో ఇన్నింగ్స్ లో సిరాజ్ ఠాకూర్ రాణించడంతో భారత విజయలక్ష్యం 324 పరుగులుగా నమోదయింది. సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ త్వరగా పెవిలియన్ బాట పట్టినా నయావాల్ పుజారాతో కలిసి జట్టు విజయానికి బాటలు వేసాడు శుభమన్ గిల్.. భారత్ సాధికారికంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గిల్, రహానే స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో పుజారాకి పంత్ జత కలిసాడు. పంత్ రాకతో టెస్టు డ్రా దిశగా వెళ్తుందని అందరికీ అనిపించింది. కారణం వీరిద్దరి జోడీ ఓవర్లను కరిగిస్తూ నింపాదిగా బ్యాటింగ్ చేశారు. పుజారా, మయాంక్ అగర్వాల్ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడం వాషింగ్టన్ సుందర్ వేగంగా పరుగులు చేయడంతో సమీకరణాలు మారిపోయాయి. ఈ దశలో సుందర్, ఠాకూర్ వెంట వెంటనే ఔట్ కావడంతో విజయంపై సందేహాలు ఏర్పడినా పంత్ ఆస్ట్రేలియాకు అవకాశం ఇవ్వలేదు. బౌండరీతో చరిత్రాత్మక విజయం సాధించాడు.
విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, బుమ్రా, అశ్విన్,జడేజా లాంటి కీలక ఆటగాళ్ల లేకుండానే భారత్ సాధించిన ఈ విజయం నభూతో న భవిష్యత్… ఓవర్లను కరగదీస్తూ నయా వాల్ పుజారా చేసిన పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ క్రమంలో పుజారా బ్యాటింగ్ తీరుపై విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా వేగంగా దూసుకొస్తున్న బంతులని కాచుకుంటూ మూడో నాలుగో టెస్టుల్లో ఆస్ట్రేలియా బౌలర్ల సహనాన్ని పరీక్షించిన తీరు అద్భుతం.. అమోఘం..మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 50(176 బంతుల్లో), రెండో ఇన్నింగ్స్ లో 77(205), నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో శరీరంపైకి దూసుకొస్తున్న బంతులను ఎదుర్కొంటూ అనేకసార్లు హెల్మెట్ ని తాకినా, శరీరాన్ని గాయపరచినా తన పోరాటాన్ని ఆపకుండా 56(211) పరుగులు సాధించాడు.
భారత్ సాధించిన ఈ విజయం ఆస్ట్రేలియా జట్టు పొగరుకు చెంపపెట్టులాంటిది. యాష్ గబ్బాకి రా అని కవ్వించిన ఆస్ట్రేలియా కెప్టెన్ కు అశ్విన్ ధీటుగా సమాధానం ఇచ్చాడు కానీ గాయం కారణంగా గబ్బా టెస్టులో ఆడలేక పోయాడు. కానీ గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాకు ఉన్న అజేయ రికార్డును బద్దలు కొట్టి భారత్ ఆసీస్ కెప్టెన్ చేసిన స్లెడ్జింగ్ కి బదులు తీర్చుకుంది. ఇప్పుడే కాదు.. గతంలో కూడా ఆస్ట్రేలియా జైత్రయాత్రకు పలుసార్లు బ్రేక్ వేసిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది.
2001 లో ఆస్ట్రేలియా వరుసగా 16 టెస్టుల్లో విజయం సాధించిన రికార్డును బ్రేక్ చేసి,భారత జట్టు 2-1తో సిరీస్ గెలిచి ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించింది.
2008 లో కూడా ఆస్ట్రేలియా జైత్రయాత్రకు టీమ్ ఇండియా బ్రేకులు వేసింది.22 టెస్టు విజయాలతో దూసుకుపోతున్న ఆస్ట్రేలియాను మట్టి కరిపించి 2-0 తో సిరీస్ కైవసం చేసుకుంది.
పెర్త్ లో వరుసగా 10 టెస్టులు గెలిచిన ఆస్ట్రేలియాను 2008లో అదే మైదానంలో ఓడించింది భారత జట్టు..
బ్రిస్బేన్‌లో వరుసగా 31 టెస్టుల్లో అజేయంగా నిలిచిన ఆసీస్ పొగరును అణచి ఆసీస్ కంచుకోటలాంటి గబ్బా కోటను బద్దలు కొట్టింది టీం ఇండియా..
అనుభవం లేని జట్టుతో అద్భుతాలు చేసిన టీం ఇండియాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. విజయోత్సాహంలో ఉన్న భారత జట్టుకు బీసీసీఐ రూ.5కోట్ల బోనస్ ప్రకటించడం విశేషం. ఏది ఏమైనా టెస్ట్ క్రికెట్ ఉన్నంత వరకూ 2021 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ అయి చెత్త రికార్డ్ మూట గట్టుకున్న టీం ఇండియా అదే సిరీస్ గెలవడం వెనుక విజయం సాధించాలన్న పట్టుదల, కసి,ఆత్మవిశ్వాసం ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సిరీస్ విజయం భారత క్రికెట్ లో ఓ కలికితురాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు..