iDreamPost
android-app
ios-app

స్నేహానికి ‘ముస్తఫా’ నిర్వచనం – Nostalgia

  • Published Jun 09, 2020 | 1:19 PM Updated Updated Jun 09, 2020 | 1:19 PM
స్నేహానికి ‘ముస్తఫా’ నిర్వచనం – Nostalgia

సినిమా ప్రభావం యువత మీద అన్ని విషయాల్లోనూ ఉండదు కానీ అసలు లేదని మాత్రం చెప్పలేం. ముఖ్యంగా ఎమోషన్స్ కి సంబంధించి లేదా వయొలెన్స్ కి సంబంధించి ఏదో ఒక రూపంలో వాటిని అనుసరించే వారు సమాజంలో ఉండనే ఉంటారు. అలా స్నేహానికి నిర్వచనం ఇస్తూ 90వ దశకంలోని యూత్ లో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసిన సినిమా ప్రేమ దేశం. 1996లో కదిర్ దర్శకత్వంలో వినీత్, అబ్బాస్ హీరోలుగా కెటి కుంజుమోన్ భారీగా నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం. ఇందులో కార్తీక్, అరుణ్ వేర్వేరు కాలేజీలలో చదువుతారు. కానీ ఒక సందర్భం వీళ్ళను ప్రాణ స్నేహితులుగా మార్చేస్తుంది.

కార్తీక్ డబ్బున్నవాడు కాగా అరుణ్ పేదరికంతో చదువును నెట్టుకొస్తూ ఉంటాడు. అయితే కార్తీక్ అదేమి మనసులో పెట్టుకోకుండా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అరుణ్ వెనుక ఉండి తీరుస్తూ ఉంటాడు. అప్పుడు వీళ్ళ జీవితంలోకి ప్రవేశిస్తుంది దివ్య. ఒకరికి తెలియకుండా ఇద్దరూ ఆ అమ్మాయిని ప్రేమిస్తారు. కానీ దివ్యకు ఆ ఆలోచన ఉండదు. అరుణ్, కార్తీక్ లు ఇద్దరూ కొట్టుకునే దాకా వస్తుంది. చివరికి ఏమయ్యిందన్నదే క్లైమాక్స్. కథ నడిచే క్రమం ఎలా ఉన్నా అరుణ్, కార్తీక్ ల మధ్య బాండింగ్ ని కదిర్ అద్భుతంగా ఆవిష్కరించారు. దీని దెబ్బకు చాలా యువకులు అబ్బాస్ స్టైల్ లోకి హెయిర్ కటింగులు చేయించుకోగా ఇంకెందరో అరుణ్ లాగా ప్రేమ కవితలు రాయడం మొదలుపెట్టారు.

ఇక అమ్మాయిలు ప్రేమంటూ వెంటపడే అబ్బాయిల నుంచి తప్పించుకోవడానికి దివ్య చెప్పిన ఫ్రెండ్ షిప్ ఫార్ములాను వాడటం మొదలుపెట్టారు. ఇంతగా కనెక్ట్ అయ్యింది కాబట్టే స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా ఏ స్టార్ లేకపోయినా ప్రేమ దేశం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. చాలా చోట్ల వంద రోజుల వేడుకలు కూడా జరిగాయి. అన్నింటి కన్నా ముఖ్యంగా రెహమాన్ స్వరపరిచిన ముస్తఫా ముస్తఫా పాట స్నేహానికి జాతీయ గీతంలా మారిపోయి ప్రతిఒక్కరి నోటా వాక్ మెన్ క్యాసెట్లలో పదే పదే మారుమ్రోగిపోయింది. దీని వల్లే అబ్బాస్ వినీత్ ల డిమాండ్ అమాంతం పెరిగిపోయి కొన్నేళ్ల పాటు తెలుగు తమిళ్ లో ఉక్కిరిబిక్కిరయ్యే అవకాశాలు దక్కించుకున్నారు. తర్వాత ప్రేమ దేశంలో స్ఫూర్తితో ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కబెట్టడం కష్టం కానీ ఇది మాత్రం ఒక ఎవర్ గ్రీన్ లవ్ కం ఫ్రెండ్ షిప్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇకపై ఉంటుంది కూడా.