Idream media
Idream media
“ప్రేక్షకుడు సినిమా టికెట్ కొని దాన్ని ఫ్లైట్ టికెట్‌గా భావించి ప్రపంచాన్ని తిరిగొచ్చిన ఫీల్ పొందాలి” అంటాడు ఓర్లాండో బ్లూం. పిరేట్స్ ఆఫ్ ది కరీబియన్‌లో విల్‌టర్నర్ గుర్తుంటే బ్లూం కూడా గుర్తుంటాడు.
“ఎంత మంచివాడవురా” సినిమాలో Central Theme ఏమంటే “మనం ఇతరులకు ఏమిస్తే, దాన్నే తిరిగి పొందుతాం” – అది ప్రేమైనా , ద్వేషమైనా! మరి మనం సినిమాకి టికెట్ డబ్బులిచ్చాం, తిరిగి ఏం పొందాం? అదే మాట్లాడుకుందాం.
ఒకప్పుడు మంచినీళ్లు బాటిల్స్‌లో పెట్టి అమ్మే కాలం వస్తుందంటే ఎవరూ నమ్మేవాళ్లు కాదు, వచ్చింది. స్వచ్ఛమైన గాలిని కొనే కాలం కూడా వచ్చేసింది (ఢిల్లీలో ఆక్సిజన్ బార్స్ వెలిశాయి). అదే విధంగా రిలేషన్స్, అనుబంధాల్ని కూడా కొనే కాలం వస్తుంది. నిజానికిది అద్భుతమైన Concept.
పిల్లలు అమెరికాలో ఉంటూ, తల్లిదండ్రుల్ని చూసి వెళ్లే తీరిక కూడా లేని కాలం ఇది. దాదాపు ప్రతి పల్లె నుంచి కూడా పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు. అమ్మానాన్నలకి అన్నీ ఉంటాయి, పలకరించే వాళ్లు ఉండరు. ఈ పాయింట్‌తో రచయిత, దర్శకుడు వేగేశ్న సతీష్ శతమానంభవతి తీశాడు. ప్రకాశ్‌రాజ్, జయసుధ అద్భుత నటన, ఎమోషన్స్ పండడంతో సినిమా హిట్ అయ్యింది. అక్కడక్కడా స్లోగా ఉన్నా ఎక్కువ మందికి కనెక్ట్ కావడంతో మంచి ప్రశంసలు పొందింది.
తర్వాత ఇదే దర్శకుడు శ్రీనివాసకళ్యాణం తీశాడు. దీన్ని సినిమా అనడం కంటే పెళ్లి గొప్పతనం మీద డాక్యుమెంటరీ అంటే మంచిది. పెళ్లంటే ఏంటి అని నితిన్ అడగడం పెళ్లంటే …అని జయసుధ చాంతాడంత స్పీచ్ ఇవ్వడం. సగం సినిమా ఇదే నడుస్తుంది. నిజానికి సొసైటీలో పెళ్లికి సంబంధించిన భావజాలంలో మార్పు కనపడుతోంది. అందుకే నిశ్చితార్థం తర్వాత బ్రేకప్‌లు, పెళ్లైన ఆరు నెలలకే విడాకులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో మూడు ముళ్లు , ఏడు అడుగులు, ఇలా నెంబర్లు చెబితే ఎవరూ వినరు.
ఇప్పుడు ఎంత మంచివాడవురా దగ్గరికొద్దాం.
ముందు మీకు రెండు సీన్స్ చెబుతాను.
ఒక నాటక ప్రదర్శన, ఆడిటోరియం నిండా జనం. హీరోహీరోయిన్లగా నటించే వాళ్లు నిజ జీవితంలో కూడా భార్యాభర్తలు. ఆ అమ్మాయికి నెలలు నిండాయి. ఈ పరిస్థితుల్లో స్టేజి మీద నటించడం కష్టమని భర్త చెబుతాడు. ఏది ఏమైనా సరే నాటకం ఆగడానికి వీల్లేదని ఆ అమ్మాయి అంటుంది.
తెరపైకి లేచింది. హీరోహీరోయిన్ల మధ్య డైలాగ్‌లు నడుస్తున్నాయి. అమ్మాయికి నిజంగా నొప్పులొచ్చాయి. కేకలు పెడుతోంది. భర్తకి అర్థమైంది. ప్రేక్షకులకి అర్థం కాలేదు. అదంతా నాటకంలో భాగమనుకున్నారు. ఇంతలో ఆడియన్స్‌లో ఉన్న ఒక లేడీ డాక్టర్ పరుగెత్తుకుంటూ స్టేజి మీదకు వచ్చింది. తెర దించేశారు. ప్రేక్షకుల్లో టెన్షన్. పసివాడి ఏడ్పు విన్పించింది.
తెర లేచింది. అప్పుడే పుట్టిన లేత శిశువుని రెండు చేతులతో పైకెత్తి ప్రేక్షకులకి చూపించాడు తండ్రి. ప్రేక్షకులు పైకి లేచి ఈ లోకంలోకి వచ్చిన కొత్త అతిథికి స్వాగతం పలికారు. ఈ ఉద్వేగంలో ప్రేక్షకుల్లో ఉన్న ఒక మహిళకి కూడా నొప్పులొచ్చాయి. దృశ్యం మాయమైంది. స్క్రీన్ మీద దర్శకుడి పేరు పడింది.
ఇక రెండో సీన్, ఒక స్టేషన్‌లో రైలు ఆగింది. వర్షాన్ని చూస్తున్న హీరోయిన్ Intro , లోపల హీరోయిన్ ఫాదర్. ఆయనకి మనసులో మాటని బయటికి అనే అలవాటు. రైల్లో టీసీతో కాసేపు కామెడీ. తర్వాత ఎవరో అమ్మాయిలు లవ్ గురించి మాట్లాడుతుంటే హీరోయిన్ వాళ్ల మధ్యన దూరి ప్లాష్‌బ్యాక్ చెబుతుంది.
మొదటి సీన్ గుజరాతీ సినిమా ఆక్సిజన్‌లోది.
రెండో సీన్ తెలుగు సినిమా ఎంత మంచివాడవురాలోది.
ఆక్సిజన్ రైట్స్ కొని ఈ సినిమా తీశారు. గుజరాత్ వాళ్లు స్వచ్ఛమైన ఆవు నెయ్యి అమ్మితే, మనవాళ్లు దాంట్లోకి డాల్డా , పామాయిల్ , సన్‌ఫ్లవర్ ఆయిల్ అన్నీ కలిపి కల్తీ చేశారు. మీకు ఈ విషయం ఆక్సిజన్ ట్రైలర్ చూసినా అర్థమైపోతుంది.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయిన తర్వాత బంధుత్వాలు, చుట్టరికాలే కాదు, రక్త సంబంధాలు కూడా మాయమై పోతున్నాయి. చిన్నతనంలో అమ్మానాన్నలని కోల్పోయిన హీరోని బంధువులు ఎవరూ చేరదీయరు. వాస్తవానికి ఇలాంటి నేపథ్యం పూరి జగన్నాథం హీరోకి ఉంటే అతను నెగటీవ్ క్యారెక్టర్‌గా మారుతాడు. కానీ ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ పాజిటీవ్ క్యారెక్టర్.
అతను ఒకమ్మాయికి అన్నయ్యగా, ఒక అన్నకి తమ్ముడిగా , ఇద్దరు ముసలివాళ్లకు మనవడిగా , ఒక తండ్రికి కొడుకుగా మారుతాడు. నిజానికి ఈ Concept చాలా అద్భుతం. బాధలో ఉన్నవాళ్లకే మనుషుల అవసరం , అనుబంధం తెలుస్తుంది.
అయితే ఎపిసోడ్స్ ఎక్కువై పోయి , ఒక మూల కథ లేకుండా పోయింది. స్క్రీన్ ప్లే Tightగా ఉంటే సతీష్ ఇంకో హిట్ కొట్టేవాడు. కథలోకి వెళ్లకుండా నరేష్ కామెడీతో సినిమా Open చేయడమే బ్లండర్. ఆ తర్వాత హీరోయిన్ ప్లాష్‌బ్యాక్‌లో Child Episode , కథని స్లో చేసింది.
హీరో ఉద్దేశం ఏమిటో అర్థమైనప్పుడు కథలో వేగం పెరిగింది. అయితే భావోద్వేగాలతో నడపాల్సిన కథలో Action Episode Start కావడంతో స్పీడ్ బ్రేకర్‌ని కొని తెచ్చుకున్నారు. అతడు సినిమా గుర్తుకొస్తే అది ప్రేక్షకుల తప్పు కాదు.
జర్నీ చేస్తున్నప్పుడు మనకి ఆకలి అయితే ఆగుతాం. ఒక హోటల్‌లో సింగిల్ ఇడ్లీ , ఇంకో హోటల్‌కి వెళ్లి సింగిల్ వడ, అక్కడ్నుంచి కొంచెం దూరం జర్నీ చేసి ఆగి ఒక దోశ తిని, ఇంకో చోటికి వెళ్లి కాఫీ తాగితే ఎట్లా ఉంటుంది? అన్నీ రుచిగా ఉండొచ్చు. కానీ ఏమి తిన్నామో గుర్తు ఉండదు. ఈ సినిమా కూడా అంతే. చాలా సీన్స్ బాగున్నట్టే ఉంటాయి కానీ, స్థిరమైన మూడ్ ఉండదు. ఒక ఎమోషనల్ సీన్ , పాట , ఫైట్ , కామెడీ బిట్ ఇట్లా ఒక రొటీన్ ఫార్మట్‌లో వస్తుంటాయి. అయితే ఈ కథ అలాంటి సబ్జెక్ట్ కాదు. అందువల్ల ఏ క్యారెక్టర్ మనకు గుర్తు ఉండరు. చివర్లో శరత్‌బాబు, సుహాసిని ఎపిసోడ్ మరీ డ్రామాగా అనిపిస్తుంది.
రిలీఫ్ ఏమంటే వెన్నెల కిషోర్, సుదర్శన్ కామెడీ. గోపిసుందర్ పాటల్లో ఒకటి మాత్రమే గుర్తు ఉంటుంది. మెహరిన్ బాగానే నటించింది. కల్యాణ్‌రామ్‌ని సాప్ట్‌గానూ, యాక్షన్ హీరోగానూ చూపించాలని అనుకోవడంలోనే దర్శకుడు తికమకపడి , ఉడికీఉడకని వంటకాన్ని వడ్డించాడు.
రాజీవ్ కనకాల విలన్‌గా నటించాడు. అతనిది విలన్ ఫేస్ కాదు. పైగా పల్లెటూర్లో అంత బిల్డప్ విలన్‌గా అసలు సూట్‌కాడు. దర్శకుడి చేతిలో పూలు ఉన్నాయి కానీ, చిన్నదారం మిస్ అయ్యింది. అక్కడక్కడ టీవీ సీరియల్‌లా ఫీల్ అయితే అది మన తప్పు కాదు.
హీరో అన్ని పాత్రలు షోషించాడు, ఒక్కటే మిగిలిపోయిందనుకుని చివర్లో తండ్రిని కూడా చేసేశారు. మనం ఏమిస్తే అదే వెనక్కి వస్తుందని సినిమాలో అనేక సార్లు చెబుతారు. మరి మేము డబ్బులిచ్చాం, ఉదయాన్నే టైం ఇచ్చాం. మరి తిరిగి మాకు ఏం దక్కింది? చెబితే బాగుండదు.